- గాయాలపాలైన యువతిని ఆసుపత్రికి తరలింపు
- పల్సర్‌పై వచ్చిన ముగ్గురు దాడి చేసి పరార్
- దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
కాజీపేట, ఆంధ్ర ప్రభ : కాజీపేట పట్టణంలోని కడిపికొండ పాత గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో ఓ యువతిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు కెమికల్ దాడి చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. జాఫర్ఘడ్ వడ్డెర తండాకు చెందిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని వెంకపూర్లోని అమ్మమ్మ ఇంటికి వెళుతుండగా ఈ దాడి జరిగింది.
పరీక్షల హాల్‌టికెట్ తీసుకుని తిరిగి వస్తున్న సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా ఆమెపై కెమికల్ ద్రావణం పోశారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. హెల్మెట్ ధరించి ఉండటంతో యువతి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ, ముఖం, మెడ, చేతులకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం.
ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు పరుగులు తీసి వచ్చేలోపు నిందితులు మరో బైక్‌తో కలిసి అక్కడి నుంచి పారిపోయారు.
సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని 108 అంబులెన్స్ ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమె పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
దాడి చేసిన వ్యక్తుల కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తూ గాలివేట కొనసాగిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి గల కారణాలను కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

