అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించిన ఛ‌టేశ్వ‌ర్ పుజారా

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు ఛటేశ్వర్ పుజారా రిటైర్మెంట్ (Chhateshwar Pujara Retirement) ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల భారత క్రికెట్ (Indian Cricket) నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన పుజారా.. టీమిండియా నయావాల్ (Team India Nayawal)గా చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తర్వాత టీమిండియాకు అడ్డుగోడలా నిలిచాడు. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడిస్తూ పుజారా భావోద్వేగపూరితమైన పోస్ట్ పెట్టాడు. తన కెరీర్‌కు అండగా నిలిచిన అభిమానులతో పాటు శ్రేయోభిలాషులకు, బీసీసీఐ(BCCI), సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌(Saurashtra Cricket Association)లకు పుజారా కృతజ్ఞతలు తెలిపాడు.

అంద‌రికీ ధ‌న్య‌వాదాలు..
‘భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతం (National Anthem) ఆలపించడం, జట్టు కోసం నా వంతుగా అత్యుత్తమ ప్రదర్శనలతో రాణించడం.. ఇవన్నీ మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా. ఈ సందర్భంగా నాకు అండగా నిలిచి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. రాజ్ కోట్ పట్టణం నుంచి కుటుంబంతో వచ్చిన ఓ కుర్రాడు.. భారత క్రికెట్‌లోకి అడుగుపెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఈ క్రమంలో నాకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఎంతో అనుభవం సాధించా. నా రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తా. ఈ సందర్భంగా బీసీసీఐ, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు ధన్యవాదాలు. క్రికెట్ కెరీర్ ఎదుగుదలకు తోడ్పాటు అందించారు.

ఫ్రాంచైజీ, కౌంటీ క్రికెట్ (County Cricket) ప్రతినిధులకూ ధన్యవాదాలు. నా మెంటార్, కోచ్‌లు, ఆధ్యాత్మిక గురు.. ఇలా ప్రతీ ఒక్కరూ నా ఎదుగుదల్లో కీలక పాత్ర పోషించారు. సహచర క్రికెటర్లు, సపోర్ట్ స్టాఫ్, నెట్ బౌలర్లు, అనలిస్ట్‌లు, లాజిస్టిక్‌లు, అంపైర్లు, గ్రౌండ్ స్టాఫ్, స్కోరర్లు మీడియా పర్సనల్, స్పాన్సర్లు, అందరీ సహకారం మరువలేనిది. నా కుటుంబ సభ్యులు, నా సతీమణి పూజ, కూతురు అదితి, స్నేహితులు.. అందరూ నాకు అండగా నిలిచారు. ఇక నుంచి మరింత సమయం నా కుటుంబానికి వెచ్చించేందుకు ప్రయత్నిస్తా.’అని పుజారా తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

2010లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి..
2010లో అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లోకి అరంగేట్రం చేసిన పుజారా 103 టెస్ట్‌లు ఆడి 7,195 పరుగులు చేశాడు. ఇందులో మూడు డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కేవలం ఐదు వన్డేలు మాత్రమే ఆడిన పుజారా 51 పరుగులే చేశాడు. భారత్ తరఫున చివరిసారిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (World Test Championship) 2023 ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఆడాడు. పేలవ ఫామ్‌తో జట్టులో చోటు కోల్పోయిన పుజారా.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. తాజాగా పుజారా కూడా ఈ జాబితాలో చేరాడు. అజింక్యా రహానే ఒక్కడే మిగిలాడు. అతను కూడా తప్పుకుంటే టెస్ట్‌ల్లో ఓ శకం ముగుస్తోంది.

Leave a Reply