రెండు గంటల్లోనే చైన్ స్నాచింగ్ నిందితుల అరెస్ట్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని పరారైన ఇద్దరు నిందితులను పోలీసులు రెండు గంటల్లోనే పట్టుకుని అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధకుమార్ తెలిపారు.

మల్కాపురం గ్రామ సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో నివసించే ధర్మకోల్ కంపెనీ ఉద్యోగి సిద్దగొని నర్సమ్మ (48) తన అక్క అళివేలుతో కలిసి పని నిమిత్తం కంపెనీకి వెళ్తుండగా, మార్గమధ్యంలోని దర్గా వద్దకు రాగానే వారి వెనుక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని యువకులు ఒక్కసారిగా నర్సమ్మ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ గొలుసును బంగారం గొలుసుగా భావించి బలవంతంగా లాక్కొని పారిపోయారు.

ఈ ఘటనపై బాధితురాలు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యాదాద్రి-భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పటోళ్ల మధుసూదన్ రెడ్డి సూచనలతో ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐ కనకటి యాదగిరి, సిబ్బంది మల్లం సందీప్, ఎం. భారద్వాజ్, ఉడుగు సైదులు కలిసి దర్యాప్తు చేపట్టారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన నిందితులు ఎండి సాయిద్, బోడ చరణ్‌లను స్థానిక శ్రీ ఆందోల్ మైసమ్మ గుడి సమీపంలో రెండు గంటల్లోపే పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నిందితుల వద్ద నుంచి సుమారు రూ.1000 విలువైన రోల్డ్ గోల్డ్ గొలుసు, ఒక నోకియా కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను శుక్రవారం న్యాయస్థానానికి హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపారు.

Leave a Reply