- ప్రసాద్ పథకం కింద అభివృద్ధి
బల్కంపేట రేణుకా ఎల్లమ్మ ఆలయ రూపురేఖలు మార్చేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాద్ పథకం కింద బల్కంపేట దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు వివరాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్(ఎక్స్)లో వెల్లడించారు. ఈ సందర్భంగా, నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధి, ఆధ్యాత్మికతకు కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు.
ప్రసాద్ పథకం కింద రూ.4.21 కోట్ల వ్యయంతో ఒకేసారి 200 మందికి పైగా వసతి కల్పించగల ఆధునిక సౌకర్యాలతో కూడిన 3 అంతస్తుల అన్నదాన భవనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన మోడల్ ఫోటోను ట్విట్టర్‌లో విడుదల చేశారు.
కేంద్ర నిర్ణయం భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుందని ఆయన అన్నారు. హైదరాబాద్ నగరంలోని ఆలయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడటానికి కేంద్ర నిర్ణయం దోహదపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
కాగా, ప్రసాద్ పథకంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని చేర్చటంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రేణుకా ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి ప్రాజెక్టుకు నిధులు కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్‌లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
