ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు: ఆదివాసి సంఘాల ఆగ్రహం

ఉట్నూర్, ఆంధ్రప్రభ: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై మంచిర్యాల్ జిల్లా క్యతన్పల్లి ఘటనలో ఏ12గా చూపిస్తూ అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని తగదని, ఇది అన్యాయమని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి పూర్క బాపూరావు, ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు, ఉట్నూర్ మాజీ ఎంపీపీ పంద్రా జైవంతరావు పేర్కొన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని ప్రెస్ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
ఆదివాసి మహిళా ఎమ్మెల్యే కోవ లక్ష్మిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మోసపూరితంగా, అన్యాయంగా కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా సంఘటన స్థలానికి సానుభూతి తెలపడానికి వెళ్లిన కోవ లక్ష్మికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, మహిళా పోలీసులను అడ్డుపెట్టి, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఆదివాసి మహిళా ఎమ్మెల్యేనని కూడా పరిగణించకుండా, అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు.
ఆమెను బలవంతంగా తీసుకెళ్లడమే కాకుండా అక్రమంగా కేసు నమోదు చేయడాన్ని ఆదివాసి హక్కుల పోరాట సమితి ‘తుడుం దెబ్బ’ మరియు ఇతర ఆదివాసి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు కొనసాగితే, తుడుం దెబ్బ మరియు ఆదివాసి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో తుడుం దెబ్బ ఆదిలాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు జైవంత్రావు, నాయకులు సీడం సోనేరావు, కనక మాలుకు, మోతిరం, సీనియర్ నాయకులు సీతారాం, కనక మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
