టోరంటో – కెనడా : ఏదైనా ఓ రోడ్డు ప్రమాదం సంభవించినప్పుడు కారో, బస్సో, లారీనో అదుపు తప్పి పల్టీ కొడుతుంటాయి. బోల్తా పడుతుంటాయి. విచిత్రంగా ఓ భారీ విమానం సైతం తలకిందులు కావడం విచిత్రం కాక మరేమిటీ?.
కెనడాలో తాజాగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 2:15 గంటల సమయంలో టోరంటో పియర్‌సన్ ఎయిర్ పోర్ట్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది గాయపడ్డారు. అదృష్టశావత్తు ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.
అమెరికాలోని మిన్నేసొటా సెయింట్ పాల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి టోరంటోకు బయలుదేరిన డెల్టా కనెక్షన్ ఫ్లైట్ 4819 అది. దీన్ని ఎండీవర్ ఎయిర్ సంస్థ ఆపరేట్ చేస్తోంది. టోరంటో ఎయిర్‌పోర్ట్ వరకూ సజావుగానే సాగింది దాని ప్రయాణం. ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. క్రాష్ ల్యాండింగ్‌కు గురైంది. రన్‌పై జారి పడింది. బోల్తా కొట్టింది.ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించలేదు. రన్‌వే మీద మంచు మందంగా పేరకుపోవడం వల్ల జారి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ రెస్క్యూ టీమ్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. సహాయక చర్యలు చేపట్టింది.విమానంలో నుంచి ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా వెలుపలికి తీసుకొచ్చింది. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పీల్ రీజినల్ పోలీస్ చీఫ సారా ప్యాటెన్ వెల్లడించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు తేలికపాటి గాయాలయ్యాయని, వారిని ఆసుపత్రికి తరలించామని తెలిపారు.
అటు డెల్టా ఎయిర్‌లైన్స్ యాజమాన్యం కూడా అధికారిక ప్రకటన జారీ చేసింది. గాయపడ్డ వారి కుటుంబ సభ్యుల కోసం పాసింజర్ ఎంక్వైరీ సెంటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎడ్ బాస్టియన్ తెలిపారు.