BWF బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ 2025 టోర్నీ త్వరలో ప్రారంభం కానుంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు ఈ నెల 25 నుండి ఆగస్టు 31 వరకు జరుగుతాయి. ఈ పోటీలు ఫ్రెంచ్ రాజధాని పారిస్‌లో జరుగనుండ‌గా.. గత సంవత్సరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నగరంలోనే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లు జరగడం విషేశం.

అయితే, భారత షట్లర్లు ఈసారి కఠినమైన పరీక్షను ఎదుర్కోనున్నారు. ఎందుకంటే ఈసారి డ్రాలో… మొదటి రౌండ్ నుండే కఠినమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు. 2010లో పారిస్‌లో జరిగిన టోర్నమెంట్‌లో భారత జట్టు ఒక్క పతకం కూడా గెలవలేదనేది గమనించదగ్గ విషయం.

తొలి రౌండ్ లోనే భార‌త్ కు ప‌రీక్ష !

పురుషుల సింగిల్స్ –

పురుషుల సింగిల్స్ లో భార‌త్ తరుఫున‌ లక్ష్యసేన్ తొలి రౌండ్ నుంచే పెద్ద పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది. 2021లో కాంస్యం సాధించిన వరల్డ్ నెం.21 సేన్.. ప్రస్తుత ఆసియా గేమ్స్ విజేత, టాప్ సీడ్ అయిన చైనాకు చెందిన షి యూకీని ఎదుర్కొనున్నాడు. ఆసియా గేమ్స్ టీమ్ ఫైనల్లో లక్ష్యసేన్ అతడిని ఓడించినా, తరువాతి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం యూకీ ఆధిపత్యం చూపాడు. దీంతో ల‌క్ష్య సేన్ కు ఈ టోర్నీలో తొలి రౌండ్ స‌వాల్ గా మార‌నుంది.

మరోవైపు 2023లో కాంస్యం గెలుచుకున్న హెచ్.ఎస్.ప్రణయ్ (వరల్డ్ నెం.34) ఫిన్లాండ్‌కి చెందిన జొయాకిమ్ ఓల్డార్ఫ్‌తో ఆరంభించ‌నున్నాడు. ఆ రౌండ్ గెలిస్తే రెండో రౌండ్‌లో డెన్మార్క్ స్టార్ ఆంటోన్సన్ ఎదురవుతాడు.

మహిళల సింగిల్స్ –

మహిళల సింగిల్స్ లో ఈసారి భారత్ ఆశలన్నీ పీ.వి. సింధుపైనే ఉన్నాయి. ఒక స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో అత్యుత్తమ రికార్డు కలిగిన సింధు, మొదటి రౌండ్‌లో బల్గేరియాకు చెందిన నల్బాంటోవాను ఎదుర్కొంటుంది.

ఈ మ్యాచ్‌లో గెలిస్తే, ప్రీక్వార్టర్స్‌లో రెండో సీడ్‌గా ఉన్న చైనా స్టార్ వాంగ్ జి యీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సింధు తన ఫామ్ కోసం కాస్త కష్టపడుతున్న నేపథ్యంలో, తొలి రౌండ్ నుంచే అదనపు శ్రమ చేయాల్సిన అవసరం ఉంది.

పురుషుల డబుల్స్ –

పురుషుల డబుల్స్‌లో భారతకు ప్రధాన బలం… సత్విక్‌సైరాజ్–చిరాగ్ జంట. 2022లో కాంస్యం సాధించిన వీరికి ఈసారి తొలి రౌండ్‌లో బై లభించింది. రెండో రౌండ్‌లో వీరికి సహచర జంట హరిహరన్–రూబన్ లేదా చైనీస్ తైపీ జంటలో ఎవరో ఒకరు ఎదురవుతారు.

ఆ తర్వాతి దశలో చైనాకు చెందిన లియాంగ్–వాంగ్ జంట కఠిన సవాల్‌గా నిలిచే అవకాశం ఉంది. వీరిపై సత్విక్–చిరాగ్ రికార్డు ప్రస్తుతం 2-6గా ఉండటం గమనార్హం. ఆ అడ్డంకిని అధిగమిస్తే, క్వార్టర్స్‌లో మలేషియా స్టార్ జంట చియా–సోహ్‌ను ఎదుర్కొనాల్సి ఉంటుంది. గత ఒలింపిక్స్‌లో ఇదే జంట సత్విక్–చిరాగ్ ప్రయాణాన్ని అడ్డుకుంది. మ‌రి ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం..

మహిళల డబుల్స్ –

మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ–గాయత్రీ గోపిచంద్ ఈసారి తప్పుకోవడంతో, భారత్ తరఫున కేవలం ప్రియ–శృతి జంటతో పాటు పాండా సిస్టర్స్ (రుతుపర్ణ పాండ-శ్వేతపర్ణ పాండ) మాత్రమే బరిలోకి దిగుతున్నారు. ప్రియ–శృతి జోడీ తొలి రౌండ్‌లో ఫ్రాన్స్ జట్టుతో తలపడనుంది. విజయాన్ని సాధిస్తే, రెండో రౌండ్‌లో ప్రపంచ నెం.4 కొరియా జంట బేక్–లీ రూపంలో పెద్ద సవాల్ ఎదురుకానుంది. పాండా సిస్టర్స్ మాత్రం బల్గేరియా స్టోవా సిస్టర్స్‌తో ఆరంభిస్తారు.

మిక్స్‌డ్ డబుల్స్ –

మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జంట ధ్రువ్ కపిలా–తనిషా క్రాస్టో (వరల్డ్ నెం.17) తొలి రౌండ్ బై లభించింది. దీంతో వీరు నేరుగా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. అక్కడ ఐర్లాండ్ లేదా అమెరికా జోడీని ఎదుర్కొంటారు. మరో జంట రోహన్ కపూర్–రుత్విక గద్దే మాకావ్ జంటను తొలి రౌండ్‌లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది.

గత సంవత్సరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన పారిస్ ఇప్పుడు మరోసారి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లకు వేదిక కానుంది.

Leave a Reply