Bheemgal | దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి…

Bheemgal | దాడి చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలి…

Bheemgal | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : గూడూరు మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిని కాపాడేందుకు వెళ్లిన గ్రామ పరిపాలన అధికారి (వీఆర్వో) షేక్.అబ్బాస్, రెవెన్యూ సిబ్బంది పై జరిగిన దాడిని గ్రామ పరిపాలన అధికారుల సంఘం (జీపీవో) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంగేమ్ పృథ్వీరాజ్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ… విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడటం అమానుషమని మండిపడ్డారు.​ అసలేం జరిగిందంటే.. గూడూరులోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు షేక్.అబ్బాస్ తన సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు.

భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో కబ్జాదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సిబ్బంది పై విచక్షణా రహితంగా దాడికి తెగబడ్డారు. ​ప్రభుత్వానికి డిమాండ్, ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్న అధికారులకు రక్షణ లేకుండా పోయిందని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే.. చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

Leave a Reply