హైదరాబాద్, ఆంధ్రప్రభ : బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. ప్రమోట్‌లపై కొనసాగుతున్న విచారణతో ఆసక్తికరమైన విషయాలు బయటపడడంతో యాప్ నిర్వాహకులపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే 19మంది నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. యాప్ నిర్వహకులే టార్గెట్‌గా కేసులో కొత్త సెక్షన్లు నమోదు చేశారు.
మియాపూర్ కోర్టులో విచారణకు అనుమతి కోరిన పోలీసులు…
యాప్ నిర్వాహకులను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని మియాపూర్ కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. అయితే ఈ చార్జిషీట్‌లో బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌పై ప్రచారం చేసిన ఇన్‌ఫ్లూయెన్సర్లను సాక్షులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్‌కు నిర్వాహకులే బాధ్యులుగా తేలుస్తూ ఇప్పటికే ప్రాథమిక ఆధారాలను పోలీసులు సేకరించారు. వాటి ఆధారంగానే పలు సెక్షన్ల కింద నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఈ కేసులో దాదాపు ఎనిమిది మందిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో, మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో 25మందిపై కేసులు నమోదు చేశారు.