Bellampalle | 29వ వార్డులో పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత

Bellampalle | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ 29వ వార్డులో హైడ్రామా చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి రాజులాల్ యాదవ్ ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారని బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి కోడి రమేష్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. గెలుపు కోసం రాజులాల్ అడ్డదారులు తొక్కుతున్నారని, ఇతర రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను దిగుమతి చేసుకున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పోలింగ్ కేంద్రం వద్ద అనుమానిత వ్యక్తులను కోడి రమేష్ ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తులకు కనీసం తెలుగు మాట్లాడటం రాదని, వారు ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని రమేష్ పేర్కొన్నారు.

“స్థానిక ఓటర్లు కాని వారికి ఇక్కడ ఏం పని? పక్క రాష్ట్రాల నుంచి మనుషులను తెచ్చి దొంగ ఓట్లు వేయిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు?” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజులాల్ యాదవ్ ఓటమి భయంతోనే ఇటువంటి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బూత్ వద్ద ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస రావు వెంటనే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. దొంగ ఓటర్లను తరలించేందుకు సహకరిస్తున్న వారిపై మరియు అక్రమాలకు పాల్పడుతున్న రాజులాల్ యాదవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోడి రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనతో 29వ వార్డు పరిసరాల్లో పోలీసులు నిఘా పెంచారు.
