BCCI | ఆసియా క్రికెట్ క‌ప్ టోర్నీకి భార‌త్ దూరం

ముంబ‌యి – భారత్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ధూర్తదేశం పాక్‌కు మరో షాక్ తప్పేటట్టు లేదు. త్వరలో జరగాల్సిన ఆసియా కప్‌ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ నిర్ణయించుకుంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు, భారత్‌లో పాక్‌పై ఆగ్రహం కట్టలు తెంచుకున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు స‌మాచారం .ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్‌తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించింది. పాక్‌ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

ఈసారి ఆసియా కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. ఈ టోర్నీకి ప్రధాన ఆకర్షణ భారత్, పాక్ మ్యాచ్‌లే. ఈ మ్యాచ్‌ జరిగే అవకాశం ప్రస్తుత పరిస్థితుల్లో లేదు. దీంతో, ఆసియా కప్ లాభదాయకతపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆసియా బోర్డుకు పీసీబీ చైర్మన్ మోహ్‌సీన్ నఖ్వీ నేతృత్వం వహిస్తున్నారు. బీసీసీఐ మాజీ సెక్రెటరీ జైషా ఐసీసీ బాధ్యతలు తీసుకున్నాక ఆసియా క్రికెట్ కౌన్సిల్ బాధ్యతలను మోహ్‌సీన్ చేపట్టారు. ఇక భారత్ నిర్ణయంతో పాక్‌‌కు ఆర్థికంగా గట్టి షాక్ తప్పదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.


‘‘పాక్ మంత్రి చీఫ్‌గా ఉన్న ఏసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనూ భారత్ పాల్గొనజాలదు. ఈ విషయాన్ని మౌఖికంగా ఏసీసీకి మేము తెలియజేశాము. త్వరలో జరగనున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌ నుంచి తప్పుకుంటున్నట్టు చెప్పాము. భవిష్యత్తులో జరిగే ఇతర టోర్నీల్లో కూడా పాల్గొనేది లేదని అన్నాము. భారత ప్రభుత్వంతో కూడా నిరంతరం టచ్‌లో ఉన్నాము’’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *