AP Assembly | పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి – నారా లోకేష్

దశలవారీగా స్కూళ్లలో ప్రహరీగోడల నిర్మాణం చేపడతాం
నాడు-నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం
శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీగోడల నిర్మాణానికి 3వేలకోట్లు అవసరం, ఉపాధి హామీ, మన బడి మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్ తో దశలవారీగా ప్రహరీగోడల నిర్మాణం చేపడతామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీగోడల నిర్మాణం, నాడు-నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ నివారణపై శాసనసభ్యులు అదితి గజపతిరాజు (విజయనగరం), మిరియాల శిరీషకుమారి (రంపచోడవరం), బండారు శ్రావణి శ్రీ (శింగనమల), పల్లె సింధూర రెడ్డి (పుట్టపర్తి) అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానమిస్తూ… ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అవుట్ కమ్స్ పై స్టార్ రేటింగ్ ఇచ్చాం. కనీస మౌలిక సదుపాయాలు లేని 1,2 స్టార్ రేటింగ్ పాఠశాలలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచిలు, టాయ్ లెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టాం.

ఈరోజు గౌరవ శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటుచేస్తున్నాం. గత ప్రభుత్వం 117 జిఓతో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేసింది. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12లక్షలమంది విద్యార్థులు తగ్గిపోయారు. 117 జిఓకు ప్రత్యామ్నాయంపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నాం. నాడు-నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి, వాటిని పూర్తిచేస్తాం. 117 ప్రత్యామ్నయంపై చర్చించిన తర్వాత టీచర్ ట్రాన్స్ ఫర్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. గత ప్రభుత్వం చేపట్టిన నాడు – నేడు పనులపై అనేక ఆరోపణలు వచ్చాయి, 117 జిఓ కారణంగా పనులు ప్రారంభించిన కొన్ని పాఠశాలలు మూతపడ్డాయి. నాడు-నేడు అవతకవకలపై నివేదిక తెప్పించుకుని, సభ్యులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. రంపచోడవరం నియోజకవర్గంలో 80పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంది. ఇక్కడ ప్రత్యేక పథకం ద్వారా మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తాం.

కెజిబివిలకి సంబంధించి నూరుశాతం ప్రహరీగోడలను ఈ సంవత్సరం డిసెంబర్ లోగా పూర్తిచేస్తాం. రాబోయే 3నెలల్లో సిసి టివి, లైటింగ్ ఏర్పాటుచేస్తాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతోపాటు సభ్యులంతా బాగస్వాములు కావాలి. పాఠశాలలకు స్టార్ రేటింగ్ తోపాటు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ లో సంస్కరణలు తెస్తున్నాం. సభ్యులు వారి నియోజకవర్గాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సిఎస్ఆర్) కింద నిధులు సమీకరించుకొని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషిచేసి, స్టార్ రేటింగ్ మెరుగు పర్చాలి. అందరూ కలసికట్టుగా ప్రహరీగోడలు, బేసిక్ ఇన్ ఫ్రా కు చొరవచూపాలి. రాబోయే అయిదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలపై లోకేష్ సమాధానమిస్తూ… డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేపడుతున్నాం. గంజాయి కారణంగా ఒక తరం ఎలా నాశనమవుతుందో తెలియజెప్పి, విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతిపాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటుచేస్తున్నాం. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్నిపాఠశాలలు, కాలేజిల్లో ఏర్పాటు చేస్తాం. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తర్వాత ఈ క్లబ్బులను యాక్టివేట్ చేస్తామని అన్నారు.

విద్యార్ధిని మ‌ర‌ణం క‌ల‌చివేసింది.

కర్నూలుజిల్లా సి.బెళగల్ మండలం పోలకల్ జిల్లాపరిషత్ హైస్కూలు ఆవరణలో ఇటీవల దురదష్టవశాత్తు చెట్టు విరిగిపడిన ఘటనలో గాయాలపాలై చికిత్సపొందుతూ 8వతరగతి విద్యార్థిని శ్రీలేఖ (14) మృతి చెందడం నన్ను తీవ్రంగా కలచివేసింది. చిన్నారి శ్రీలేఖ మృతితో ఆమె తల్లిదండ్రులకు కలిగిన నష్టం తీర్చలేనిది. శ్రీలేఖ కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తుంద‌ని నారా లోకేష్ స‌భ‌లో చెప్పారు.

త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటన చేస్తాం

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసిపి సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. ఇదిలావుండగా… గత వైసిపి ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. గత 30ఏళ్లలో టిడిపి ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 నడుమ చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వం 2014,18,19లలో మూడు డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల‌ను విడుద‌ల చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *