(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : వెన్నుపోటుకి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. నాడు ఎన్టీఆర్ దగ్గర నుండి మొదలుపెడితే నేడు రాష్ట్ర ప్రజల వరకు ఏదో ఒక అంశంలో వెన్నుపోటు పొడుస్తూనే చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఏడాది పూర్తయినప్పటికీ ఒక్క ఎన్నికల హామీ కూడా అమలు చేయలేదని చెప్పినా ఆయనను ప్రశ్నించిన వారికి కేసులు వేధింపులు తప్పడం లేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో పార్టీ శ్రేణులంతా కలిసి వెన్నుపోటు దినం పేరుతో భారీ ర్యాలీని నిర్వహించారు.
నగరంలోని పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి సర్కిల్ త్రీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలో అధికారులను ఎన్నికల హామీలన్నీ అమలు చేయాలని వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని నేడు అన్నివర్గాల వారు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. హామీలు అమలు చేయటానికి నాది బాధ్యత అని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ప్రజలకు బాండ్ పేపర్లు ఇచ్చారనీ, ఆ బాండ్ పేపర్లు ఏమి చేయాలి ఎక్కడ పెట్టుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారని వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు, తదితరులు పాల్గొన్నారు.