అవగాహన తప్పనిసరి

  • అధికారులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ సంతోష్


గద్వాల ప్రతినిధి, అక్టోబర్ 10(ఆంధ్రప్రభ) : సమాచార హక్కు చట్టం ప్రభుత్వ అధికారుల పనితీరులో పారదర్శకత, జవాబుదారి తనాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందించడం జరిగిందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ (Collector BM Santosh) అన్నారు. అక్టోబర్ 5 నుంచి 12 వరకు ఆర్టీఐ అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం గద్వాల ఐడిఓసీ సమావేశపు మందిరంలో జిల్లా అధికారులకు చట్టంపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పౌరులకు సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం వారు అడిగిన సమాచారాన్ని నిబంధనల ప్రకారం ఇవ్వడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య ప్రభుత్వం (Democratic government) లో ఆయా శాఖల నుంచి తమకు కావలసిన సమాచారాన్ని పొందడం పౌరుల హక్కుగా చెప్పారు. ఈ చట్టం ప్రకారం ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్దేశిత సమయంలో ఇవ్వకుంటే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వారోత్సవాల సందర్భంగా గ్రామాలు, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సమాచార హక్కు చట్టం దరఖాస్తుల(applications) ను ఎలా అందజేయాలి, ఎలాంటి సమాచారాన్ని అడగకూడదు అనే విషయాలపై ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్నారు. ప్రజలు అడిగిన దాని ప్రకారం ఆయా శాఖలలో ఉన్న సమాచారాన్ని కచ్చితంగా ఇవ్వడం అధికారుల బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం కలెక్టర్ అధికారులతో సమాచార హక్కు చట్టంపై ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, నర్సింగరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply