Awareness | ఊరికెళ్తున్నారా… జర జాగ్రత్తలు పాటించండి…

Awareness | ఊరికెళ్తున్నారా… జర జాగ్రత్తలు పాటించండి…

  • సంక్రాంతి, మేడారం జాతర నేపథ్యంలో భద్రతపై ప్రత్యేక చర్యలు
  • అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయండి
  • ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం
  • చోరీలు జరగకుండా మైక్ ప్రచారం, కరపత్రాల పంపిణీ
  • స్టేషన్ ఘన్ పూర్ సీఐ జి.వేణు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : పబ్లిక్ హాలిడేలు కొనసాగుతున్న నేపథ్యంలో స్టేషన్ ఘన్‌పూర్ పోలీసులు ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు తరలి ప్రజలతో పాటు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే ప్రజల ఇండ్లల్లో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల్లో భాగంగా ఇవాళ‌ ఘన్‌పూర్ పోలీసు సిబ్బంది మైక్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భద్రతా సూచనలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి అవగాహన కల్పించారు.

ఈసందర్బంగా సీఐ వేణు మాట్లాడుతూ.. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ కాని డిజిటల్ లాకింగ్ సిస్టమ్ అమర్చుకోవాలన్నారు. బీరువా తాళాలు ఇంటిలో బెడ్ క్రిందకాని, బట్టల క్రిందకాని పెట్టకుండా, వెంట తీసుకెళ్లాల‌న్నారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్ లో లేదా మీగ్రామ పోలీస్ అధికారికి సమాచారం ఇవ్వాలన్నారు. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండన్నారు.

ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిది, ఇంటి ముందు గేటుకు తాళం వేయకండన్నారు. తాళం వేస్తే ఇంటిలో ఎవరూ లేరని దొంగలు గుర్తిస్తారన్నారు. మీ గ్రామం, పట్టణం, కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండని అన్నారు. డయల్ 100కు కాల్ చేయాలన్నారు. అనంతరం ప్రజల సహకారం ఉంటేనే నేరాలను నివారించగలమని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని సీఐ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినయ్, పోలీ స్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply