బాలికల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను ప్రభుత్వ వైద్యశాలను ఈ రోజు ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త(ITDA PO Khushboo Gupta) ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. మండల కేంద్రంలోని బాలికల అశ్రమోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్టర్లు, తరగతిగదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ.. విద్యారంగ బలోపేతం దిశగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని, ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించి నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని తెలిపారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతి రోజు మెనూ ప్రకారం పోషక విలువలు గల ఆహారాన్ని అందించాలని, అవసరమైన ఐరన్, సి విటమిన్ టాబ్లెట్ల(Tablets)ను అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సబ్జెక్టుల వారీగా విద్యార్థులకు అర్ధమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా పిఓ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా(dengue, malaria) వంటి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వసతి గృహ పరిసరాలలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు వంటశాల, స్టోర్ రూమ్(store room), త్రాగునీరు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించి, సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడిగి విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరిశీలించారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం తప్పనిసరిగా రావాలని ఉపాధ్యాయులకు సూచించారు. విధులలో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు(show cause notices) జారీ చేశారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వార్డులు, మందుల నిల్వలు, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. సీజనల్(seasonal) వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు వ్యాప్తి చెందకుండా పాటించవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. రోగులతో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మండలంలో వ్యాధుల పరిస్థితులు విషయాలపై వైద్యాధికారుల(medical officers) వైద్య ఉద్యోగులతో అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో అశ్రమంలో త పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పార్వతి, వైద్య అధికారి అశోక్, వైద్య ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.