Cpm | శ్రామికవర్గంపై లేబర్ కోడ్‌ల పేరుతో దాడి

- సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు
- 26న దేశవ్యాప్త ఆందోళనకు సీపీఎం మద్దతు
- గూగుల్ డేటా సెంటర్ వివరాలు బయటపెట్టాలి
- సంజీవని పేరుతో ఆరోగ్యసేవలు ప్రైవేటుపరం
- అన్నదాతలను అప్పుల పాల్జేస్తున్న ప్రభుత్వం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
- పోలవరం బనకచర్ల పేరుతో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్లక్ష్యం
- మావోయిస్టులపై బూటకపు ఎన్‌కౌంటర్లు ఆపాలి..
Cpm | ఆంధ్రప్రభ, విజయవాడ : నాలుగు లేబర్‌కోడ్స్ అమలు కోసం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడం శ్రామికవర్గంపై దాడని, దీన్ని రాష్ట్రాలు కూడా కచ్చితంగా అమలు చేయాలని కేంద్రం ఒత్తిడి చేయడం అప్రజాస్వామికమని, వాటి హక్కులనూ కాలరాయడమేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. సోమవారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. యజమానులకు పూర్తి అనుకూలంగా లేబర్‌కోడ్‌లు తెచ్చి, అమలు చేయాలని రాష్ట్రాలను ఒత్తిడి చేస్తూ నోటిఫికేషన్ తెచ్చిందని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ కోడ్‌లు కార్మికవర్గానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని చెప్పారు. వీటిల్లో కనీస వేతనం నిర్వచనాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని అన్నారు.
కార్మిక యూనియన్లకు సమ్మె చేసే హక్కును, వేతనాల కోసం యజమాన్యంతో చర్చించే హక్కునూ లేకుండా చేశారని విమర్శించారు. కార్మికశాఖను పనికిరాని సంస్థగా మార్చేశారని, అధికారులను ఫెసిలిటేటర్లుగా పేర్కొన్నారని తెలిపారు. గిగ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించలేదని పేర్కొన్నారు. కార్మికరంగం రాష్ట్రాల పరిధిలో ఉంటుందని, దాన్ని కూడా కేంద్రం పరిధిలోకి తీసుకుంటోందని విమర్శించారు. కేరళ వంటి రాష్ట్రాల్లోనూ ఇటువంటి అప్రజాస్వామిక చట్టాలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తోందని, వీటిని అంగీకరించే ప్రసక్తే లేదని తెలిపారు. కార్మికవర్గంపై దాడి చేయడం అంటే మొత్తం ప్రజలపైదాడి చేయడమేనని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 26న కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనను సిపిఎం పూర్తిగా సమర్థిస్తుందని తెలిపారు.
గూగుల్ డేటా సెంటర్ వివరాలు బయటపెట్టాలి…
విశాఖపట్నం దగ్గర్లోని తర్లువాడలో పెడుతున్న అదానీ గూగుల్ డేటా సెంటర్ వివరాలను వెంటనే బయటపెట్టాలని రాఘవులు డిమాండు చేశారు. రాష్ట్రానికి ఉపయోగమే అయితే వివరాలు ఎందుకు బయపెట్టడం లేదని ప్రశ్నించారు. అక్కడ 49 మంది దళిత రైతుల నుండి 100 ఎకరాలు డిఫారం పట్టా భూములు వద్దని వ్యతిరేకిస్తున్నా బలవంతంగా తీసుకుంటున్నారని అన్నారు. రూ.1.50 లక్షల కోట్లతో కంపెనీ పెడుతున్న గూగుల్ అక్కడ రైతుల నుండి తీసుకుంటున్న భూములకు భూమిని ఎందుకు ఇవ్వదని ప్రశ్నించారు. దానికి ఎంత నీరు, విద్యుత్ కావాలనే విషయాలనూ బయటపెట్టాలన్నారు. నీటిని ఎక్కడ నుండి తీసుకొస్తారో చెప్పాలన్నారు. డేటా సెంటర్‌కు వాడే విద్యుత్‌తో విశాఖపట్నానికి ఏడాది మొత్తం ఉచితంగా సరఫరా చేయొచ్చని పేర్కొన్నారు. వాతావరణం దెబ్బతింటుందని, ప్రపంచంలో చాలాదేశాలు వ్యతిరేకిస్తున్నాయని పేర్కొన్నారు. అటువంటి డేటా సెంటర్‌ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎందుకో చెప్పాలన్నారు. దీనిపై కనీసం సామాజిక పర్యావరణ అధ్యయన నివేదిక కూడా బయటపెట్టలేదని, అసలు పర్యావరణ ప్రభావం అంచనా చేశారా లేదా చెప్పాలన్నారు. లక్షల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నప్పుడు అక్కడ స్థానికులకు ఎందుకు ఉపాధి కల్పించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలను, హక్కులను, వాతావరణాన్ని ఫణంగా పెట్టే గూగుల్‌ను ఇక్కడకు ఎందుకు తీసుకువస్తున్నారో చెప్పాలన్నారు.
సంజీవని పేరుతో వైద్యసేవలు ప్రైవేటుపరం..
ముఖ్యమంత్రి ప్రకటించిన సంజీవని అమలు చేయడమంటే ఆరోగ్య సేవలను ప్రైవేటుపరం చేయడమేనని రాఘవులు విమర్శించారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం దాచేస్తోందని తెలిపారు. గత బడ్జెట్లో రూ.19000 కోట్లు కేటాయించారని అదంతా ఖర్చు చేస్తే ఆరోగ్యరంగం పెద్దఎత్తున అభివృద్ధి చెందేదని అన్నారు. ఆరోగ్యరంగాన్ని పూర్తిగా ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం కోసమే దీన్ని పెట్టారని, దీనివల్ల కార్పొరేట్లకు లబ్ది తప్ప పేదలకు ఏమీ ఉండదని పేర్కొన్నారు. దీనిలో టిసిఎస్, బిల్‌గేట్స్ మిలిందా ఫౌండేషన్ భాగస్వాములని తెలిపారు. దీనివల్ల ప్రజల ఆరోగ్య డేటా మొత్తం ప్రైవేటు మందుల కంపెనీలకు, పరిశోధనా సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు లబ్ది కలిగిస్తుందని, వేల కోట్ల వ్యాపారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. కార్పొరేట్ల లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.
ఆపరేషన్ ఖగార్ పేరుతో గిరిజనులపై దాడి..
ఎన్‌కౌంటర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులను కాల్చిచంపుతోందని, ఆపరేషన్ ఖగార్ పేరుతో గిరిజన ప్రజానీకంపై యుద్ధం చేస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తెలిపారు. కార్పొరేట్ సంస్థలు అడవి, సహజ వనరులు, ఖనిజాలపై కన్నేశాయని, వాటికోసం మావోయిస్టుల ఎన్‌కౌంటర్ల పేరుతో గిరిజనులను తరిమేసి, అడవులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కేంద్రం చేస్తున్న కుట్రల్లో భాగమే మావోయిస్టుల హత్యలని తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లన్నీ బూటకమని, వేర్వేరు చోట్ల తలదాచుకున్న వారందరినీ పట్టుకెళ్లి కాల్చిచంపుతున్నారని అన్నారు. గతంలో మావోయిస్టులు సిపిఎం నాయకులను కాల్చిచంపారని, అయినా రాజకీయంగా విభేదిస్తూనే వారిపై జరిగే దాడిని వ్యతిరేకిస్తామని తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని అన్నారు. చర్చలకు సిద్ధమన్న వారిని పట్టుకు చంపుతున్నారని పేర్కొన్నారు. అలాగే ఎన్‌కౌంటర్లకు ఎపి అనువైన ప్రాంతంగా గుర్తించారని, ఎపి ప్రభుత్వం బిజెపి క్రూరత్వానికి ప్రతినిధిగా నిలుస్తోందని అన్నారు. దేశాల మధ్య యుద్ధరంగంలో సైనికులు దొరికితే వారిని మర్యాదగా చూసుకుని ఆయా దేశాలకు తిరిగి అప్పగిస్తారని, కానీ పోలీసులు మాత్రం మావోయిస్టులను పట్టుకుని కాల్చిచంపుతూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం కస్టడీలో ఉన్న మావోయిస్టులను కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండు చేశారు.
రైతులకు చేసిందేమిటి..?
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రైతన్న మీకోసం పేరుతో కార్యక్రమం చేపట్టిందని, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు, వ్యవసాయానికి చేసిన మేలేమిటో చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 30 లక్షల మంది కౌలుదారులకు అన్యాయం చేశారన్నారు. రాష్ట్రంలో పండుతున్న ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదని, ఎందుకు కల్పించలేకపోతుందో చెప్పాలని కోరారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు లక్షకోట్ల ఆదాయాన్ని కోల్పోయారని తెలిపారు. అలాగే పత్తి, మొక్కజొన్న, సోయా, పాల ఉత్పత్తులను అమెరికా నుండి దిగుమతి చేసుకునేందుకు ట్రంప్‌తో మోడీ ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ ఒప్పందంతో వ్యవసాయానికి మరణశాసనం రాయడమేనని అన్నారు. దీనివల్ల రైతులు నష్టపోతారని, వారిపై ప్రభుత్వానికి కనీస సానుభూతి కూడా లేదని పేర్కొన్నారు. ఇదంతా రైతులను దివాళా తీయించే కార్యక్రమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు పోలవరం బనకచర్ల పేరుతో రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, రూ.2000 కోట్ల ఖర్చు చేస్తే వెనుకబడిన జిల్లాలో అనేక ప్రాజెక్టులు పూర్తవుతాయని, అయినా చేయడం లేదని అన్నారు. ఇటీవల పోలవరం పునరావాసం కోసం రూ.1000 కోట్లు కేటాయిస్తే దానిలో 12 శాతం కూడా నేరుగా నిర్వాసితులకు చేరలేదని, ఎక్కువ మొత్తం కాంట్ట్రార్లకు ఇచ్చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని, కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు.
చంద్రబాబుకు నిజాయితీ ఉంటే విశాఖకు సొంత గనులు కేటాయించాలి..
అసలు ఉనికిలోలేని మిట్టల్ ఫ్యాక్టరీకి గనులు కేటాయించిన ప్రభుత్వం విశాఖ స్టీలు కేటాయించడం లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా దీనిపై నోరెత్తడం లేదని తెలిపారు. చంద్రబాబు అసహనంతో కార్మికులపై నోరు పారేసుకుంటున్నారని, విశాఖ ఉక్కును ఆదుకోవాలని ఆయన నిజాయితీగా కోరుకుంటే ముందుగా దానికి సొంతగనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు గనులు కేటాయించకుండా, ఉన్న కార్మికులను తొలగిస్తూ నష్టాల పాల్జేస్తూ ప్రైవేటీకరణ ఆపుతాము అంటే ప్రజలను మోసం చేయడమేనని శ్రీనివాసరావు విమర్శించారు. పైకి ఎన్ని మాటలు చెప్పినా ప్రైవేటీకరణను ఆపకుండా ప్లాంటును దెబ్బతీసే విధంగా వ్యవహరించడం పూర్తిగా అన్యాయమని పేర్కొన్నారు.
