- అసిస్టెంట్ ప్రొఫెసర్ల అరెస్టుకు నిరసనగా
- విధులు బహిష్కరించి ప్రధాన గేటు వద్ద నిరసన
- జీఓ 21ను రద్దు చేయాలి
బాసర, ఏప్రిల్ 10 (ఆంధ్రప్రభ) : తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నత విద్య ఎడ్యుకేషన్ కౌన్సిల్ ముట్టడికి ప్రయత్నించిన సందర్భంగా అరెస్టుకు నిరసనగా గురువారం బాసర ఆర్జీయూకేటి యూనివర్సిటీలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ల అసోసియేషన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు బాసర ఆర్జీయూకేటి యూనివర్సిటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ విధులు బహిష్కరించి బంద్ లో పాల్గొన్నారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 21జీఓ ద్వారా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్లను తక్షణమే రెగ్యులర్ చెయ్యాలని, బేసిక్, డీఏ, హెచ్ ఆర్ ఏ, మూడు శాతం వేతనాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కృష్ణ ప్రసాద్, ఉపేందర్, శ్రీశైలం, శంకర్ దేవరాజ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.