- ఉల్లాసం.. ఉత్తేజం
- ఇవీ విజయవాడ ఉత్సవ్ ఎగ్జిబిషన్ లోని కోణాలు
- వరుణుడు కరుణిస్తే ఈ వేదికపై సినీతారల సందడే సందడి
- బాలకృష్ణ చేతుల మీదుగా 27న ఘనంగా ప్రారంభం…
- ఓజి సినిమా విజయోత్సవ సభ
- కాంతారా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహణ
- ఇవీ ఎంపీ కేశినేని శివనాథ్ సన్నహాలు
ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : విందు వినోదం ఆహ్లాదాన్ని సమపాళ్లలో అందించేందుకు సర్వాంగ సుందరంగా ఎగ్జిబిషన్ ముస్తాబయింది. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా జరుగుతున్న ఎగ్జిబిషన్‌కు అద్భుతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. గొల్లపూడి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి అంశంలోనూ సక్రమమైన సదుపాయాలు కల్పించాలని అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు. వర్షం అనుకూలిస్తే ఈనెల 27న హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభం కానుంది.
ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ను సందర్శించే ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీ సూచించారు. పార్కింగ్ సదుపాయాలను విస్తృతంగా కల్పించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. వర్షాల హెచ్చరికల నేపథ్యంలో మైదానంలో డ్రైనేజ్ వ్యవస్థ, షెల్టర్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఎంపీ ఆదేశించారు.
అలాగే ఎగ్జిబిషన్‌లో ప్రజల వినోదం కోసం ప్రదర్శన స్టాళ్లు, ఫుడ్ స్టాళ్లు, ప్రత్యేక ఆకర్షణలు సిద్ధం చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్న ఏర్పాట్లు సమీక్షించిన ఎంపీ, మరిన్ని మెరుగులు దిద్దాలని సూచించారు.
విజయవాడ ప్రజలకు ఈ ఎగ్జిబిషన్ ఒక కొత్త అనుభూతిని అందించడానికి తాము కృషి చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే గొల్లపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుంచి ఓజి సినిమా విజయోత్సవ సభ నిర్వహించాలని భావిస్తున్నామని, ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
అక్టోబర్ 2న రిలీజ్ కానున్న కాంతారా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 30న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఎంపీ వివరించారు. రానున్న రోజుల్లో విజయవాడ ఉత్సవ్ నగర వాసులకు మరింత కనువిందు చేయనుందని ఎంపీ స్పష్టం చేశారు.
విజయవాడ దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది ఉత్సవాలకు భక్తుల తాకిడి బాగా పెరిగిందని ఎంపీ తెలిపారు. సహజంగా మూల నక్షత్రం రోజున భక్తులు పోటెత్తుతారని, అలాంటిది గురువారం ఒక రోజే లక్షన్నర మంది అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించినట్లు ఎంపీ వెల్లడించారు.



