AP | ఉల్లంఘిస్తే ఊరుకోం..

AP | ఉల్లంఘిస్తే ఊరుకోం..
- ఆచరిస్తే అభినందిస్తాం..
- రహదారి భద్రతలో జిల్లాను నంబర్‌వన్‌గా నిలుపుదాం
- సమష్టి కృషితో రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేద్దాం
- ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తు.చ. తప్పకుండా పాటించాలి
- చిన్నచిన్న జాగ్రత్తలే మన కుటుంబాలను నిలబెడతాయి
- రహదారి భద్రత మాసోత్సవాల్లో ఎన్టీఆర్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
AP | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రయాణ సమయంలో తీసుకునే చిన్నచిన్న జాగ్రత్తలే కుటుంబాలను సురక్షితంగా నిలబెడతాయని, సమష్టి కృషితో రహదారి భద్రతలో ఎన్‌టీఆర్ జిల్లాను నంబర్‌వన్‌గా నిలుపుదామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఎంజీ రోడ్డు, ఈట్‌స్ట్రీట్ వద్ద ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ, డీసీపీ షేక్ షరీన్ బేగం, ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ తదితరులతో పాటు రవాణా, పోలీసు, ట్రాఫిక్ తదితర శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి రహదారి భద్రత వాక్‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారులు భద్రంగా ఉంటే మన ఊరు భద్రం, మన రాష్ట్రం భద్రం, మన దేశం భద్రంగా ఉంటుందని, ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా రహదారి ప్రమాదాల నివారణకు కృషిచేయాలన్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ప్రతి ప్రాంతంలోనూ రహదారుల భద్రతకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ట్రాఫిక్ సెన్స్, సివిక్ సెన్స్ ముఖ్యమని, హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం, అధిక వేగాన్ని నివారించడం వంటి జాగ్రత్తలు కుటుంబాలకు భద్రత కల్పిస్తాయని చెప్పారు. రహదారి భద్రత విషయంలో నిర్లక్ష్యం వహించకుండా సహకరించిన వారికి అభినందనలు తెలియజేస్తామని, ఇదే సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఊరుకునేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
రవాణాశాఖ, పోలీసు శాఖ, వివిధ భాగస్వామ్య పక్షాల భాగస్వామ్యంతో తీసుకున్న చర్యల వల్ల 2024తో పోల్చితే 2025లో 80 వరకు మరణాలను తగ్గించగలిగామని.. ఇదే స్ఫూర్తితో ముందడుగు వేసి ప్రజలు, విద్యార్థులు, వాహనదారులు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా పాల్గొని జిల్లాను రహదారి భద్రతలో ఆదర్శంగా నిలుపుదామన్నారు.
డీసీపీ షేక్ షరీన్ బేగం మాట్లాడుతూ.. రహదారి భద్రతకు సంబంధించి జిల్లాలో పోలీసు శాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, రోడ్డు ప్రమాదాలతో పాటు మరణాలు కూడా తగ్గాయన్నారు. మనకోసం మనం పెట్టుకున్న నిబంధనలను మనమే పాటించకుంటే ఎలా? అని ప్రశ్నించారు. ద్విచక్ర వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని.. బండి నుంచి హెల్మెట్‌ను వేరుచేయకుండా సురక్షితంగా ప్రయాణించి గమ్యాన్ని చేరుకోవాలన్నారు.

ఏపీ ఎన్‌జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ..ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా జిల్లా రవాణా శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతుండటం అభినందనీయమన్నారు. ఆర్‌టీసీ డ్రైవర్ల తరహాలోనే మిగిలిన వారు కూడా బాధ్యతాయుత డ్రైవింగ్‌ను ఓ మంచి అలవాటుగా మార్చుకొని జిల్లాను రహదారి భద్రతలో ముందంజలో నిలుపుదామన్నారు. రహదారి ప్రమాదాల నివారణకు జిల్లా యంత్రాంగం చేపట్టే కార్యక్రమాల్లో ఉద్యోగులు కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఎ.మోహన్ మాట్లాడుతూ. జిల్లా కలెక్టర్ వారి అధ్యక్షతన ఎప్పటికప్పుడు రహదారి భద్రతపై సమావేశాలు జరుగుతున్నాయని.. వీటిలో తీసుకున్న నిర్ణయాలను సమన్వయ శాఖల భాగస్వామ్యంతో అమలుచేస్తున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలనూ భాగస్వామ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్లు తెలిపారు. మాసోత్సవాల సందర్భంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌టీవోలు ఆర్.ప్రవీణ్, ఎ.వెంకటేశ్వరరావు, రవాణా శాఖ ఉద్యోగుల సంఘ జోనల్ అధ్యక్షులు ఎం.రాజుబాబు, ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వయకర్త డా. కొల్లేటి రమేష్, సుదీష్న ఫౌండేషన్ నుంచి సీహెచ్ విమల, పెద్దఎత్తున విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
