AP | నీటి కుంట‌లో ప‌డి ముగ్గురు చిన్నారులు మృతి..

(ఆంధ్రప్రభ, అన్నమయ్య బ్యూరో/చిట్వేలి) : ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్టలో అలా వైకుంఠం ఇలా ఇలకు దిగివచ్చిన రీతిలో.. శ్రీ సీతారాముల పెళ్లి సందట్లో భక్త జనం పరవశించిపోతుంటే.. . మరొకవైపు పల్లెల్లోని రామాలయాల్లో కోలాహలం కొన్న తరుణంలో శుక్రవారం సాయంత్రం వేళ మృత్యువు కరాళ నృత్యం ఓ ఊరిని కుదిపేపింది. కన్నీటి సంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘటనతో ఆ ఊరిజనం తల్లడిల్లిపోయిన వైనం ఇలా ఉంది. తమ గ్రామంలోని నీటి కుంటలో చిట్టి చేపల వేటకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు మృత్యు ఒడికి చేరారు. శ్రీసీతారాముల కళ్యాణ వేడుకల్లో తల్లిదండ్రులు మునిగిపోగా.. ఈ ముగ్గురు నీటికుంటలో మునిగి మృతి చెందారు.

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం మైలపల్లి రాచపల్లిలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఈ విషాదం చోటు చేసుకుంది. ఏడేళ్ల చిన్నారులు చొక్కరాజు దేవానంద్, చొక్కరాజు జయ జయ రెడ్డి, చర్ల యశ్వంత్ రాజు, మరో చిన్నారి కలిసి ఓ థంప్స్ అప్ బాటిల్ కొనుక్కుని గ్రామంలోని నీటి కుంటవద్దకు వెళ్లారు. చేపలు పట్టేందుకు ఈ ముగ్గురు నీటి కుంటలో దిగారు. లోతు తెలియని గుంతలో దిగటంతో ముగ్గురు నీటిలో మునిగిపోయారు. ఈత రాక బయటకు రాలేక.. ఊపిరాడక మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షి ఐదేళ్ల బాలుడు అక్కడ నుంచి భయపడి వెనక్కి వచ్చేశాడు. భయంతో ఈ దుర్ఘటన సమాచారానికి పెద్దలకు ఆ బాలుడు చెప్పలేదు. ఆడుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు ఇంటికి రాకపోవటంతో రాత్రి 8.00 గంటలు ఊరంతా వెతికారు. నీటి కుంటలోకి వెళ్లి చూడగా ఈ ముగ్గురు మృతదేహాలను కనిపించటంతో పెద్దలంతా చలించిపోయారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ఊరు ఊరంతా ఆగని కన్నీరుతో విలపించింది. ఈ రెండు రోజులు గ్రామంలో ఎక్కడా పొయ్యి వెలిగించ లేదంటే అక్కడి విషాద పరిస్థితి తెలుస్తుంది.

కువైట్ నుంచి హుటాహుటిన ఆ ఇద్దరు
చిట్వేలి మండలం ఎం రాచపల్లిలో జరిగిన ఈ ఘటనతో మృతులు చొక్కా రాజు, యశ్వంత్ రాజు తండ్రులు శేఖర్ బాబు, వెంకటేశ్వరరాజు కువైట్ నుంచి హుటాహుటిన ఇంటికి వచ్చేసారు. తమ కుమారులు అకాలంగా మృతి చెందారన్న విషయాన్ని తెలుసుకున్నప్పటి నుంచి ఇంటికి వచ్చేవరకూ తండ్రుల సోకాన్ని ఆపడం ఎవరి తరమూ కాలేదు. శేఖర్ రాజు విజయకు ముగ్గురు కుమారులు. వారిలో చొక్క రాజు ఆఖరి పుత్రుడు. చర్ల వెంకటేశ్వరరాజు, సుప్రజకు కూడా ముగ్గురు కుమారులు. వీరిలో మృతి చెందిన యశ్వంత్ రాజు మొదటి బిడ్డ. ఆ రెండు కుటుంబాలు వ్యవసాయ ఆధారంగా జీవించేవి. సేద్యంలో నష్టాలు రావడంతో తమ భార్యలను బిడ్డలను వదిలి పిల్లలను చదివించాలని ఆ ఇద్దరూ కువైట్ కు వలసలు వెళ్లారు.

దివ్యాంగుడి ఘోష
చిట్వేలి మండలం మైలపల్లి రాసపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజు వికలాంగుడు. వినికిడి లేమి భవన నిర్మాణ కార్మికుడు. తన తండ్రి పక్షవాత వ్యాధితో మంచాన పడి ఉండగా తన ఇద్దరి పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివించుకుంటూ రెక్కల కష్టం చేసి జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చొక్కా రాజు దేవానంద్ తన స్నేహితులతో కలిసి కుంటలోకి వెళ్లి మృత్యువాత పడటంతో ఆ కుటుంబం భరించలేని శోకంతో మంచం ఎక్కింది.
ఇక జయ యశ్వంత్ రాజు చిట్వేలి లోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నట్టు తెలిసింది. దేవానంద్ మాత్రం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు. వీరు ముగ్గురూ మంచి స్నేహితులు. ఒంటిపూట బడి కావడంతో గ్రామంలో ఉత్సవాలు జరుగుతుండగా నీటిలో చేపలు పట్టాలని వెళ్లారు. నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనతో శనివారం ఉదయం నుంచి రాచపల్లి దారి కిటకిటలాడింది. ఈ విషాద ఘటన ప్రాంతానికి చుట్టుపక్కల గ్రామాల జనం బయలుదేరారు. ప్రజాప్రతినిధులు కూడా రాచపల్లికి చేరుకున్నారు.

అన్ని విధాల ఆదుకుంటాం..

కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే శ్రీధర్
ఓదార్చిన కుడా చైర్మన్ రూపనంద రెడ్డి
ముగ్గురు చిన్నారులు మృతి చెందిన ఘటనపై కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్చార్జ్,కుడా చైర్మన్ ముక్కారూపానంద రెడ్డి శనివారం ఉదయం బాధిత కుటుంబాలను ఓదార్చారు. చిన్నారుల మృతికి మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని, ప్రభుత్వ సాయంతో పాటు తాము వ్యక్తిగత సాయం కూడా చేస్తామని ఎమ్మెల్యే, చైర్మన్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ మాట్లాడుతూ పిల్లల మృతి పై కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు రూపానంద రెడ్డి ధైర్యం చెప్పి తాను కలెక్టర్ తో మాట్లాడి సాయం అందే విధంగా చూస్తారని హామీ ఇచ్చారు. పల్లె సెంటిమెంటును గౌరవిస్తూ..
రెండు రోజులుగా రాచపల్లిలో పొయ్యి వెలిగించక పస్తులుంటున్న జనం పసిపిల్లల మృతితో గొల్లుమంటున్నారు. పోస్టుమార్టం పేరుతో చనిపోయిన పసిబిడ్డలను ఆసుపత్రికి తరలించలేమని రూపానందరెడ్డి కి ఒక విజ్ఞప్తి చేశారు. పల్లె ప్రజల సెంటిమెంటును గౌరవించాలని, ఆ గ్రామానికి వెళ్లి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని రైల్వే కోడూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బ్రహ్మకుమారిని రూపానంద రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *