AP | రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు వ‌ద్ద ఉద్రిక్త‌త..

  • మిథున్ రెడ్డి అరెస్ట్‌పై వైసీపీ శ్రేణుల నిర‌స‌న‌

రాజ‌మండ్రి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన‌ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించ‌గా… రాజమండ్రి సెంట్రల్ జైలుకు త‌ర‌లించారు. అయితే, ఈ క్ర‌మంలో రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. మిథున్ రెడ్డిని జైలుకు తరలిస్తుండగా, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో జైలు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశాయి.

మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైసీపీ కార్యకర్తలు, నాయకులు జైలు పరిసరాల్లో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమ పార్టీ ఎంపీని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి పాత్ర..

మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చారు. స్కాం అమలు కోసం ప్రత్యేక అధికారులను ప్రభావితం చేయడంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని, రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూరే విధంగా వారికి సూచనలు చేశారని సిట్ పేర్కొంది.

అలాగే, మద్యం సిండికేట్ సభ్యులతో కలిసి వసూలు చేసిన కమిషన్లు, ముడుపుల డబ్బును రాజకీయ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు ఆర్థిక లాభం చేకూర్చారని సిట్ విచారణలో తేలింది. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు, హైకోర్టు ఇప్పటికే కొట్టేసిన విషయం తెలిసిందే.

ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకు మిథున్ రెడ్డికి రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ క్ర‌మంలో జైలు వద్ద వైసీపీ శ్రేణుల నిరసనతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Leave a Reply