వెలగపూడి – ఎమ్మెల్యేల శిక్షణా తరగతులపై జగన్ పత్రికలో వచ్చిన కథనాలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సీరియస్ అయ్యారు. ఆ మీడియాపై విచారణ జరిపేందుకు ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నట్టు అయ్యన్న తెలిపారు. సభా హక్కుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు. చట్టసభలపై కూడా గౌరవం లేకుండా ఆ మీడియాలో కథనాలు వస్తుండటం బాధాకరమని అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎమ్మెల్యేల శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయల ఖర్చు పెట్టారంటూ ఆ పత్రికలో వచ్చిన కథనాల పేపర్ కటింగులను అసెంబ్లీలో స్పీకర్ ప్రదర్శించారు. అందులో వచ్చిన కథనాల విషయాన్ని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య సభ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పీకర్ స్పందిస్తూ… ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహించలేదని… జరగని శిక్షణా తరగతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని ఆ పత్రిక లో రాశారని మండిపడ్డారు. లోక్ సభ స్పీకర్, ఏపీ స్పీకర్ పై కథనాలు రాశారని చెప్పారు. ఇలాంటి తప్పుడు రాతలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని… ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేస్తున్నానని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా ఆ పత్రిక పై తదుపరి చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
మాజీ సిఎం జగన్ పై స్పీకర్ అసహనం ..
అలాగే.. నిన్న (సోమవారం) గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా వైసీపీ వ్యవహరించిందన్నారు.. సీఎంగా పనిచేసిన వ్యక్తి, పార్టీకి అధినేత వ్యక్తి సభ్యత మరిచి ప్రవర్తించారని అన్నారు. పార్టీ సభ్యులు గందరగోళం చేస్తుంటే చూస్తూ నవ్వుతూ కూర్చున్నారే తప్ప వారిని ఆపే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచేలా ప్లేకార్డ్స్ పట్టుకొచ్చారని.. పోడియంపై విసిరేశారని అన్నారు. ఇది ఏం సంప్రదాయమని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్దతి కాదన్నారు. సీనియర్ సభ్యులు బొత్స సత్యనారాయణ కూడా జగన్ చేసేది తప్పని చెప్పకపోవడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగటానికి వీల్లేదని అన్నారు. ఇకపై అయినా విజ్ఞతతో వ్యవహరించాలని హితవుపలికారు. రాజ్యాంగం ద్వారా కాకుండా సర్వ హక్కులు తనకే ఉన్నాయ్ అన్నట్లు ప్రవర్తించటం ఎవరికీ తగదని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై అభ్యంతరాలు ఉంటే చర్చలో పాల్గొనాలే తప్ప ఇలాంటి చర్యలు సరికాదన్నారు. నిన్నటి వైసీపీ తీరును ప్రతీ ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు.