సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలు
రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతం చేయొద్దు
పోలవరం పనులు 80శాతం టీడీపీ హయాంలోనే
జగన్ హయాంలో ఇటుకు ముక్క కూడా పేర్చలేదు
మండలిలో ఆగ్రహం వ్యక్తం చేసిన రామానాయుడు
వెలగపూడి, ఆంధ్రప్రభ :
సముద్రంలోకి వృథాగా పోతున్న జలాలను ఏపీ వాడుకుంటే తప్పేంటని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. కొందరు రాజకీయ ఉనికి కోసం రాద్దంతాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరిపై మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణంపై నాడు చంద్రబాబు వెళ్లి ధర్నా చేసి అరెస్టైన సంగతి మర్చిపోతే ఎలా అని నిలదీశారు. 2024 సంవత్సరంలో కృష్ణా నదికి చివరన ప్రకాశం బ్యారేజీ నుంచి 871 టీఎంసీల నీరు సముద్రంలోకి పోయిందని తెలిపారు. శాసన మండలిలో పోలవరంపై సభ్యుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. తమ హయాంలో 80 శాతం డయా ఫ్రం వాల్ పనులు పూర్తి చేస్తే, జగన్ అయిదేళ్ల పాలనలో ఇటుక ముక్క కూడా పేర్చలేదన్నారు.. ఇక ఎత్తు తగ్గించేది లేదని తేల్చి చెప్పారు..
మిగులు జలాలనే వాడుకుంటున్నాం..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రయోజనాల కోసం, సానుకూల వాతావరణంలో ఆలోచించాలని మంత్రి నిమ్మల సూచించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2024 అక్టోబర్ 25వ తేదీ వరకు ఇన్‌ఫ్లో వస్తూనే ఉందన్నారు. రెండేళ్లు కృష్ణాలో నీరు లేక కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ కింద క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఈ నీటిని ఉపయోగించుకోకపోతే ప్రాజెక్టులు నిండిపోయాయి కాబట్టి బంగళాఖాతంలోకి పోతాయని చెప్పారు. అత్యంత అవసరమైన నీరు సముద్రంలోకి పోయి ఉప్పునీరులో కలసి పోవడమా? అవసరమైన ప్రాంతాలకు తరలించడమా అనేది ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. హంద్రీనీవా పాపానికి, జాప్యానికి రాయలసీమ ముద్దుబిడ్డనని చెప్పుకునే జగనే కారణమని మండిపడ్డారు నిమ్మల. తమ రాజకీయ ఉనికి కోసం, పదే పదే ఏపీ మీద అవాస్తవమైన ఆరోపణలు చెయ్యడం తగదు తెలంగాణ నేతలకు నిమ్మల హితవు పలికారు. ఏదైతే చట్ట బద్ధంగా, న్యాయ బద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటానే తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.