AP | విద్యుత్ సైకిల్‌ రూపొందించిన యువకుడికి పవన్ కళ్యాణ్ అభినందన..

  • లక్ష రూపాయల ప్రోత్సాహం

విజయనగరం జిల్లా జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన ఇంటర్మీడియేట్ విద్యార్థి రాజాపు సిద్ధూ తక్కువ ఖర్చుతో తయారు చేసిన బ్యాటరీతో సైకిల్ రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. ఈ వినూత్న ఆవిష్కరణను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అభినందించారు.

సామాజిక మాధ్యమాల ద్వారా సిద్ధూ సైకిల్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న‌ పవన్ కళ్యాణ్, అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి ఆహ్వానించి, స్వయంగా కలుసుకున్నారు. సిద్ధూ రూపొందించిన సైకిల్‌ను స్వయంగా నడిపి, తన ఆవిష్కరణను సమీక్షించారు.

ఈ సందర్భంగా సిద్ధూ ప్రతిభను ప్రశంసించిన పవన్ కళ్యాణ్, “ఇలాంటి యువతే భవిష్యత్తు భారతానికి నిలువెత్తు ఆదర్శం” అని పేర్కొన్నారు. సిద్ధూ భవిష్యత్తులో మరిన్ని సరికొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రూ.1 లక్ష నగదు ప్రోత్సాహం అందించారు. అంతేకాకుండా, సిద్ధూని సైకిల్‌పై కూర్చోబెట్టి స్వయంగా నడిపిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సిద్ధూ తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ను మూడున్నర గంటలు ఛార్జ్ చేస్తే, సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ప్రధానంగా కాలేజీకి రాకపోకల కోసం సిద్ధూ ఈ సైకిల్‌ను డిజైన్ చేశాడు. ఖర్చు తక్కువగా ఉండటంతో ఇది గ్రామీణ ప్రాంత యువతకు ఆదర్శవంతంగా మారుతోంది.

ప్రస్తుతం ఈ సైకిల్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అవుతుండటంతో, సిద్ధూకి రాష్ట్రవ్యాప్తంగా నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Leave a Reply