పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
నియోజకవర్గ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామీ
పిఠాపురం, ఆంధ్రప్రభ : పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణం స్పందించే నాయకుడుగా ఉన్న ఆయన అలాంటిది తన సొంత నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్య రానివ్వరని భరోసా ఇచ్చారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
పిఠాపురం నియోజకవర్గంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన నూతన రోడ్లను ఆయన నేడు ప్రారంభించారు. డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ కొత్త రోడ్లను నిర్మించారు. కుమారపురం హౌసింగ్ లే అవుట్-1లో రూ. 15.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును , విరవ గ్రామం నుంచి గోకివాడ బ్రిడ్జి వరకు ఎంజీఎన్‌ఆర్‌ఇజీఎస్ నిధులతో రూ. 75లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును నాగబాబు మండలి ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ తో కలిసి ప్రారంభించారు.
సమస్యలు పరిష్కరించడం మా బాధ్యత
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “సమస్యలు చెప్పడం ప్రజల హక్కు.. ప్రజా ప్రతినిధులుగా వాటిని పరిష్కరించడం మా బాధ్యత. పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన దృష్టికి వచ్చిన ఎవరెవరో సమస్యలు పరిష్కరిస్తారు. మీ ప్రాంత సమస్యలు కూడా ఆయన దృష్టికి వచ్చాయి. మీరు చెప్పిన సమస్యలన్నింటికీ త్వరలోనే పరిష్కారం చూపుతాం” అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, పిఠాపురం మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.