ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) లో నైపుణ్య శిక్షణ అందించేందుకు, అలాగే రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ స్థాపనకు దోహదపడేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కంప్యూటింగ్ సంస్థ ఎన్విడియా (NVIDIA) తో కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరగింది.
ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని 10వేల మంది విద్యార్థులకు ఏఐలో నైపుణ్య శిక్షణ కల్పించనున్నారు. అంతేకాక, 500 ఏఐ ఆధారిత స్టార్టప్‌ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక మద్దతు, మార్గదర్శకతను ఎన్విడియా అందించనుంది. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక ఏఐ పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ దృష్టిని బలపరచే దిశగా ఈ ఒప్పందం కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్విడియా సౌత్ ఏసియా ఎండీ విశాల్ దూపర్, స్ట్రాటజిక్ బిజినెస్ డైరెక్టర్ గణేష్ మహబాల, ఏవీపీ ప్రైమస్ పార్ట్నర్ సుమన్ కసానా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ కె. మధు మూర్తి తదితరులు పాల్గొన్నారు.