ఎపిలో పెట్టుబడులపై చర్చ
నౌకా నిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు,
ఆటోమొబైల్స్ , విద్య రంగాలపై జపాన్ ఆసక్తి
వెలగపూడి – జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు నేడు బేటి అయ్యారు. అమరావతిలోని ఎపి సచివాలయంలో జరిగిన ఈ బేటిలో పలు అంశాలపై చర్చించారు.. ఎపిలో పెట్టుబడుల అవకాశాలపై చంద్రబాబు జపాన్ బృందానికి వివరించారు. దీనిపై ఆ బృందం సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు.
“ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్‌లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చలు జరిగాయి. వృద్ధికి కొత్త అవకాశాలను అందించడానికి నౌకానిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొనసాగాయి” అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.