తాడేపల్లి – వైసీపీ హయాంలో లిక్కర్ విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని తేల్చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్. ఆయనకు ఆయనే క్లీన్‌చిట్ ఇచ్చుకున్నారు. తప్పంతా చేసింది చంద్రబాబు ప్రభుత్వమేనని ఎదురుదాడి చేశారు.. తాడేపల్లిలోని ఆయన నివాసంలో నేడు మీడియాతో మాట్లాడుతూ, భయపెట్టి, బెదిరించి తప్పుడు సాక్షాలు సృష్టించి అరాచకంగా ప్రభుత్వం వ్యవహారి స్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం తనను బెదిరిస్తుందని చెబుతూ ఏపీ బేవరేజెస్ మాజీ ఎంపీ వాసుదేవరెడ్డి హైకోర్టులో మూడుసార్లు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. 2014-19 మధ్యకాలంలో లిక్కర్ స్కామ్‌లో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారంటూ కొత్త విషయాన్ని బయటపెట్టారు.
కసిరెడ్డికి ఏం సంబంధం ..
బేవరేజెస్ కార్యకలాపాలకు రాజ్ కసిరెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వం సలహాదారుల్లో ఆయన కూడా ఒకరన్నారు. కేవలం రెండేళ్లు మాత్రమే ఆయన పని చేశారన్నారు. కూటమికి మేలు జరిగేలా విజయసాయిరెడ్డి వ్యవహారించారని ఆరోపించారు. విజయవాడ టీడీపీ ఎంపీతో రాజ్ కసిరెడ్డి వ్యాపారాలు ఉన్నాయంటూ కేశినేని నాని మాటలనే ప్రస్తావించారు. వారికి వ్యాపార సంబంధాలు ఉన్నాయని, పలు కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. తామంతా కలిస్తే గూగుల్ టేకేవర్ కు తెలీదా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు.
మిధున్ రెడ్డిని ఇరికించారు..
ఎంపీ మిధున్‌రెడ్డికి లిక్కర్ వ్యవహారంలో ఏం సంబంధం అని అన్నారు. లోక్‌సభలో ఆయన ఫ్లోర్ లీడర్ అని చెప్పారు. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధముందని ప్రశ్నించారు. దానికి సంబందించిన ఫైలుపై వారు సంతకం పెట్టలేదన్నారు.
ఆ ముగ్గురు మంచి అధికారులు
వైసీపీ హయాంలో పని చేసిన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలు, పీఎస్ఆర్ ఆంజనేయలతోపాటు మరికొందరు మచ్చలేని అధికారులంటూ వారందర్నీ తీసుకొచ్చి జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో లాటరీ పేరుతో లిక్కర్ షాపులు మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారని తూర్పూరబట్టారు. గతంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలను వాటిని తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎప్పుడూ చూడని బ్రాండ్లు లేవా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వస్తే ధరలు ఎక్కడ తగ్గిస్తామని చెప్పారని, ఎక్కడ తగ్గించారని అన్నారు. ఎంఆర్ఫీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారని, అది స్కామ్ కాదా అని అన్నారు. 99 రూపాయలకు లిక్కర్ ఇచ్చి, దాని క్వాలిటీని తగ్గించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు.
మోసాలతోనే కూటమి ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అంతా మోసాలతో నడిచిందన్నారు జగన్. అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా అమలు చేయలేదని చెప్పారు. రాష్ట్రంలో 3.8శాతం మాత్రమే గ్రోత్ కనిపిస్తోందన్నారు. ఏడాది పాలనతో ప్రజల కొనుగోలు శక్తి, పెట్టుబడులు తగ్గాయని తెలిపారు. తమ పాలనలో చివరి ఏడాది రూ.67వేల కోట్ల అప్పులు చేశామని, చంద్రబాబు ఏడాది పాలనలో రూ.81వేల కోట్ల అప్పులు చేశారని ఆయన ఆరోపించారు. గతంలో అమరావతి పనుల కోసం 2018లో టెండర్లు పిలిచారని, ఆనాడు ఖరారైన టెండర్ల విలువ అక్షరాలా రూ.41,170 కోట్లని వివరించారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు పూర్తి చేసిన పనులు మినహా రూ.35 వేల కోట్లతో పనులు చేయాల్సి ఉందన్నారు. ఆ టెండర్లను రద్దు చేసి, మిగిలిన పనుల అంచనాలు అమాంతం పెంచేసి దోపిడీ చేస్తున్నారని అన్నారు.
చంద్రబాబుకు లొంగిపోయిన విజయసాయి
తమ పార్టీ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకి లొంగిపోయారని ఆరోపించారు జగన్. కూటమికి మేలు చేసేందుకు పదవీకాలం ఉండగానే రాజ్యసభకు ఆయన రాజీనామా చేశారన్నారు. వైసీపీకి ఎమ్మెల్యేల బలం లేదని భావించి, రాజ్యసభకు పంపదని తెలిసి రాజీనామా చేశారన్నారు. ప్రలోభాలకు లోనై ఆ సీటును అమ్మేశారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఇచ్చిన స్టేట్‌మెంట్లకు ఏం విలువ ఉంటుందని అన్నారు.
జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం.. నిరసన కార్యక్రమాలు
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని జగన్ స్పష్టం చేశారు ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని పిలుపు ఇచ్చారు.