ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్)కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఈ ఐపీఎస్ అధికారి తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలేనని స్పష్టం చేశారు. కౌశల్ వీఆర్ఎస్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై అనేక రకాల ప్రచారాలు జరిగాయి, రాజకీయ రంగు పులుముకుంది.
రాజకీయ ఆరోపణలు, కౌశల్ స్పష్టత
చంద్రబాబు సర్కార్ ఒత్తిళ్లు, రాజకీయ వేధింపుల వల్లే ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్ తీసుకున్నారని ప్రతిపక్ష వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే, సిద్ధార్థ్ కౌశల్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తన పదవికి రాజీనామా చేయడానికి ఎలాంటి బలవంతం కానీ, ఒత్తిళ్లు కానీ, రాజకీయ వేధింపులు కానీ లేవని స్పష్టం చేశారు. దీర్ఘకాలిక జీవిత లక్ష్యాలు, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
కెరీర్..
సిద్ధార్థ్ కౌశల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలకు ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా విధులు నిర్వర్తించారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పని చేశారనే ఆరోపణలు కౌశల్ పై ఉన్న సంగతి తెలిసిందే.