ప్రధాని రాకతో ఏపీ సర్కారు బిజీబిజీ

ప్రధాని రాకతో ఏపీ సర్కారు బిజీబిజీ
- ఏర్పాట్లపై సీఎం స్వీయ పర్యవేక్షణ
- అభివృద్ధి ప్రతిపాదనలు రెడీ
- తిరుమల తరహాలో అభివృద్ధికి ప్రతిపాదన
- దేవాదాశాఖకు 2000 హెక్టార్ల అటవీ భూమి అప్పగింతకు వినతి
- రూ.1600 కోట్లతో అభివృద్ధికి విజ్ఞప్తులు సిద్ధం
నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీశైలం మల్లన్నసన్నిధికి ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) రాక కబురుతో.. ఏపీ ప్రభుత్వం సకల ఏర్పాట్లల్లో మునిగి తేలుతోంది. సాక్షాత్తు దేశ ప్రధాని దృష్టికి శ్రీశైలం(Srisailam) అభివృద్ధి ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. తిరుమల తిరుపతి, శబరిమలై(Sabarimalai) తరహాలో శ్రీశైలం పుణ్యక్షేత్రాన్నిఅభివృద్ధి చేయటానికి అవసరమైన నిధులు, ప్రతిపాదనలను రెడీ చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఆదివారం సీఎం నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) తన క్యాంపు కార్యాలయంలో శ్రీశైలం దేవాలయ అభివృద్ధి ప్రణాళికలపై దేవాదాయ, అటవీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి(Budda Rajasekhara Reddy) ఈ సమాచారం తెలిపారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan), దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయశాఖ, అటవీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్నిఅభివృద్ధి చేసేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అటవీ ప్రాంతంలోని శబరిమల లాంటి దేవాలయాల్లో భక్తులకు కల్పిస్తున్నసౌకర్యాలను అధ్యయనం చేసి శ్రీశైల క్షేత్రాన్నిమరింతగా అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం ప్రతిపాదనను అందరూ ఆమోదించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని 2వేల హెక్టార్ల(2 thousand hectares) భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.
ప్రధానమంత్రి దేవాలయ సందర్శనకు వస్తన్నసందర్భంగా కీలక ప్రతిపాదనలు తయారు చేశారు. శ్రీ శ్రీ నక్షత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీశైలంలో పులుల అభయారణ్యం అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ప్రతి ఏడాది పెరుగుతున్నభక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరిన్నిసౌకర్యాలు రూపొందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి అధికారులు కొత్త ప్రతిపాదనలు చేశారు. రూ.1,600 కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సీఎం, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ప్రధానికి విన్నవించే ఆస్కారం ఉందని తెలుస్తోంది. శ్రీశైలం పుణ్య క్షేత్రానికి భక్తులతో పాటు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. శ్రీశైలంలో ఫైవ్ స్టార్ హోటల్(five-star hotel) నిర్మాణానికి ప్రతిపాదన రూపొందించారు. ఇందుకోసం సున్నిపెంట ప్రాంతంలో 50 ఎకరాల భూమిని కేటాయించారు.
2026 సంవత్సరంలో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ప్రతిపాదన రూపొందించారు. సిస్టర్ ఫైవ్ స్టార్ హోటళ్ల(sister five-star hotels)తో పాటు హెల్త్ టూరిజంని ప్రోత్సహించే విధంగా రిసార్టులు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానమంత్రికి సమర్పించే నివేదిక ప్రతిపాదనల్లో శ్రీశైల క్షేత్ర కారిడార్, నూ క్యూ కాంప్లెక్స్, మండపాల నిర్మాణం తదితరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి రాకతో జిల్లాలోని శ్రీశైలం మరింత శోభను సంతరించుకుంటుందని ప్రముఖులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి(Mallikarjuna Swamy) దేవస్థానానికి ఈనెల 16న వస్తున్నారు. ఈ సమాచారంతో భద్రత బలగాలు శ్రీశైలాన్ని చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లా పోలీస్(police) సిబ్బందికి తక్షణ కర్తవ్యం నిర్వహణ బాధ్యతలను ఎస్పీ సునీల్ షేరన్ అప్పజెప్పారు.


