తుగ్గలి (ఆంధ్రప్రభ) – మండలం పరిధిలోని రాంపల్లి గ్రామానికి చెందిన ఎర్రబాటి వెంకటరాముడు (48) అనే రైతు అప్పుల బాధ భరించలేక సోమవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. భార్య ఎర్రబాటి లక్ష్మి తెలిపిన వివరాల మేరకు ఎర్రబాటి వెంకటరాముడు తనకున్న 5 ఎకరాల వ్యవసాయ పొలం లో పంటల సాగు కోసం చేసిన అప్పులు ఎక్కువ కవడం తో వాటిని ఎలా తీర్చాలని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె తెలిపారు
దాదాపు రూ 20 లక్షలు అప్పు ఉన్నట్లు ఆమె తెలిపారు. సహకార సంఘం బ్యాంకు లో రూ 10 లక్షల 20 వేలు అప్పు ఉండడంతో పాటు ఇతరుల వద్ద మరో రూ10 లక్షలు అప్పు ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ బి నాగభూషణ్ రెడ్డి, సర్పంచ్ మనేంద్ర లు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న రైతు ఎర్రబాటి వెంకటరాముడు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుగ్గలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.