AP Deputy Chief Minister | పవనన్న కానుక

AP Deputy Chief Minister | పవనన్న కానుక
- కొండగట్టులో రూ.35.16 కోట్ల నిధులతో..
- డిసెంబర్ 3న దీక్ష విరమణ మండపం..
- విశ్రాంతి భవన నిర్మాణలకు శంకుస్థాపన
AP Deputy Chief Minister | ( వెలగపూడి ప్రతినిధి, ఆంధ్రప్రభ ) : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రం కొండగట్టును ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం దర్శించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10గం.30ని. నుంచి 11 గం.30ని. మధ్య ఈ కార్యక్రమాలు ఉంటాయి. కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇలవేల్పుగా భక్తితో కొలుస్తారు. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత కొండగట్టు స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడినప్పుడు కొండగట్టు క్షేత్రానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులు పడుతున్న ఇబ్బందులు దృష్టికి వచ్చాయి. దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టి.టి.డి. సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదనలు చేశారు. ఏపీ

సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ ఈ విషయమై టి.టి.డి. ఛైర్మన్ బి.ఆర్.నాయుడుతో చర్చించారు. టి.టి.డి. బోర్డు (Board) రూ.35.19 కోట్లు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి భవనం నిర్మాణాలు చేపడతారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు , ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ , చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం , టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి , బి.మహేందర్ రెడ్డి , టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ ఎన్ శంకర్ గౌడ్ , ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొంటారు.

తెలంగాణ జనసైనికులతో భేటీ..
ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన (janasena) మద్దతుతో గెలిచిన సర్పంచులతోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు.
