- రింగ్ సెంటర్ లో ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీసుల చర్యలు
- ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తోడ్పాటు
- బస్సులు బస్టాపుల్లో ఆగే విధంగా చర్యలు..
- ప్రయాణికులకు అర్ధమయ్యేలా పబ్లిక్ అనౌన్స్ మెంట్
- సత్ఫలితాలిస్తున్న ట్రాఫిక్ పోలీసుల చర్యలు
ఇబ్రహీంపట్నం (ఆంధ్రప్రభ): ఇబ్రహీంపట్నం ట్రాఫిక్ పోలీసులు పలు నూతన చర్యలు చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్ బాబు, ట్రాఫిక్ డీసీపీ షేక్ షరీనా బేగం ఆదేశాల మేరకు సీఐ చంద్రశేఖర్ పర్యవేక్షణలో.. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ సమీపంలోని బస్టాప్ వద్ద ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు తరువాత ప్రయాణికుల తాకిడి మరింతగా పెరిగింది.
ఇబ్రహీంపట్నం జాతీయ రహదారి నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సులు బస్టాప్‌లో ఆగిన సందర్భాలు లేవు. బస్సులను జాతీయ రహదారిపై నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుండటమే కాకుండా, ప్రమాదాలు పెరిగాయి.
ఈ సమస్యను గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు బస్సులను బస్టాప్ వద్ద ఆపే విధంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బస్సులు ఎక్కే అవకాశం లభించడంతో పాటు రింగ్ సెంటర్ లో ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోయాయి. అలాగే ప్రయాణికులకు సులభంగా అర్థమయ్యేలా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.
దీంతో బస్సులు ఎక్కడ ఆగుతాయో, ప్రయాణికులు ఎక్కడ నిలబడాలో స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఈ చర్యలతో రింగ్ సెంటర్ పరిసరాల్లో ట్రాఫిక్ సాఫీగా కొనసాగుతోంది. ప్రయాణికులు ట్రాఫిక్ పోలీసుల కృషిని ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

