AP | వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ ఆమోదముద్ర

వెలగపూడి :: వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పుపై చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వైఎస్ఆర్ కడపగా జిల్లా పేరు మార్చాలని నిర్ణయించింది.

సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ జిల్లాకు కడప పేరు కలుపుతూ కెబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా పరిగణించనున్నారు. గతంలో వైఎస్ఆర్ కడప జిల్లా పేరు ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వం జిల్లా పేరులోని కడప తొలగించింది. దీంతో నాటి నుంచి వైఎస్ఆర్ జిల్లాగా వ్యవహరిస్తున్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లుపై.

ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మంత్రులతో మాట్లాడిన అనంతరం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ మిశ్రా ఇచ్చిన నివేదిక, దానిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినెట్ చర్చించింది. రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జిల్లా యూనిట్‌గా చేయాలని కొంతమంది మంత్రులు కోరారు. అలా చేస్తే న్యాయ పరమైన చిక్కులు వస్తాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి నివేదికను యధాతధంగా ఆమోదిద్ధామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

బేడ బుడగ జంగాలపై కీలక నిర్ణయం..గ్రూప్ 1 కేటగిరిలో రెల్లి ఉపకులాలకు ఒక శాతం, గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్ 3 మాల ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతానికి రాష్ట్రం యూనిట్‌గా అమలు జరపాలని నిర్ణయించారు. రోస్టర్ పాయింట్లను 200గా ప్రభుత్వం నిర్ణయించింది. బేడ బుడగ జంగాలను రెల్లి ఉప కులాల్లో చేర్చాలని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20వ తేదీన జాతీయ ఎస్సీ కమిషన్‌కు తీర్మానాన్ని పంపించాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. 2026 సెన్సెస్ రాగానే జిల్లాల వారీగా అమలు జరిపే అంశాన్ని పరిశీలిద్దామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నెల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చించనున్నారు. అదే రోజు తీర్మానాన్ని నేషనల్ ఎస్సీ కమిషన్‌కు పంపాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్

రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్ కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రాజధాని అమరావతిలో భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపైనా కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. ఈ అంశంపై ఇటీవల రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిషన్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది

.మరిన్ని కేబినెట్‌ నిర్ణయాలు..

నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం

అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం

పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం పచ్చజెండా

వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పేరు ఇకపై తాడిగడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *