AP | ట్రేడ్ లైసెన్స్ బకాయిలపై నగరపాలక సంస్థ కఠిన చర్యలు

AP | ట్రేడ్ లైసెన్స్ బకాయిలపై నగరపాలక సంస్థ కఠిన చర్యలు
- 196 దుకాణాలకు క్లోజర్ నోటీసులు.
- రూ.15 లక్షల వసూళ్ల లక్ష్యం
AP | కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు నగరపాలక సంస్థకు రావాల్సిన ట్రేడ్ లైసెన్స్ బకాయిల వసూళ్లలో సిబ్బంది వేగం పెంచారు. బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వ్యాపారులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ అధికారులు స్పష్టం చేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించని దుకాణదారులపై చివరి దశ చర్యగా క్లోజర్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నగరంలోని ప్రధాన వాణిజ్య ప్రాంతమైన షరాఫ్ బజార్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ బకాయిలు చెల్లించని 196 దుకాణాలకు శనివారం క్లోజర్ నోటీసులు అందజేశారు. రూ.15 లక్షల బకాయిలు పెండింగ్ష రాఫ్ బజార్ ప్రాంతంలోనే సుమారు రూ.15 లక్షల మేర ట్రేడ్ లైసెన్స్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు నగరపాలక సంస్థ వర్గాలు వెల్లడించాయి.
ఈ బకాయిలు చెల్లించకుండా వ్యాపారాలు కొనసాగించడం వల్ల మున్సిపల్ ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తప్పవు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు చెల్లించడం ప్రతి వ్యాపారి చట్టబద్ధమైన బాధ్యత అని, గడువు దాటినా స్పందించకపోతే దుకాణాల మూసివేత, సీజ్ చర్యలు తప్పవని సిబ్బంది హెచ్చరించారు. ఇప్పటికే పలువురు వ్యాపారులకు చివరి అవకాశం కల్పించినప్పటికీ స్పందన లేకపోవడంతోనే క్లోజర్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
వసూళ్ల పెంపుపై ప్రత్యేక దృష్టి నగరపాలక సంస్థ ఆదాయ వనరులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వంటి బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు పేర్కొన్నారు. మిగిలిన వ్యాపారులు స్వచ్ఛందంగా బకాయిలు చెల్లించి, ఇబ్బందులు ఎదుర్కోకుండా సహకరించాలని కోరారు. వ్యాపార వర్గాల్లో చర్చ క్లోజర్ నోటీసుల జారీతో షరాఫ్ బజార్ వ్యాపార వర్గాల్లో చర్చ మొదలైంది. కొందరు వ్యాపారులు బకాయిల చెల్లింపుకు ముందుకు రాగా, మరికొందరు గడువు పెంచాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే, నిబంధనల ప్రకారం మాత్రమే చర్యలు కొనసాగుతాయని అధికారులు తేల్చి చెప్పారు.
