జక్కంపూడి ఎన్టీఆర్ హౌసింగ్ టిడ్కో గృహప్రవేశాలు..

జక్కంపూడి ఎన్టీఆర్ హౌసింగ్ టిడ్కో గృహప్రవేశాలు..
లబ్ధిదారులకు తాళాలు, ఇళ్ల పత్రాలు అందజేత..
పేదవాడి సొంత ఇంటి కల టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యం.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు..
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : జక్కంపూడి కాలనీలో ప్రభుత్వం అందించిన ఎన్టీఆర్ హౌసింగ్ టిడ్కో గృహప్రవేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు,తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామమోహన్రావు, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో కలసి లబ్ధిదారులకు తాళాలు, ఇళ్ల పత్రాలు అందజేసి,టిడ్కో గృహప్రవేశాలు ప్రారంభించారు.పేదవాడి సొంత ఇంటి కల టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని ఆయన అన్నారు.ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన 284 మంది లబ్ధిదారులకు తాళాలు అందజేయడం జరిగిందని అన్నారు.

టిడ్కో ఇళ్లు అత్యాధునిక సాంకేతికతతో నిర్మించబడి, పేదవారికి కేవలం ఒక ఇల్లు మాత్రమే కాకుండా సంపూర్ణ జీవన వసతులు కలిగించే విధంగా రూపుదిద్దుకున్నాయని తెలిపారు, డబుల్ బెడ్‌రూమ్ సౌకర్యంతో పాటు, పిల్లల కోసం పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆట స్థలాలు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలను సమగ్రంగా అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపొందించబడిందన్నారు.టిడ్కో ఇళ్ల కోసం ప్రభుత్వం సబ్సిడీతో పాటు బ్యాంకు రుణాలు కల్పించి, వివిధ పరిమాణాల్లో ఇళ్లను పేదలకు మంజూరు చేసిందని తెలిపారు. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల వేలాది ఇళ్లు నిలిచిపోయాయని, పేదలకు అవసరం లేదనే కారణాలతో పక్కన పెట్టడం జరిగిందని అన్నారు.

ఇదే సమయంలో సెంటు పట్టా పేరుతో చేపట్టిన కార్యక్రమంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం తిరిగి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆగిపోయిన టిడ్కో ప్రాజెక్టులను పునఃప్రారంభించి, కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించి పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డా.డి. చంద్రశేఖర్,జోనల్ కమిషనర్లు బి. రమ్య కీర్తన, కె. ప్రభుదాస్, కె. షమ్మీ, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం. విజయలక్ష్మి, జాయింట్ డైరెక్టర్ అమృత్ ఇన్‌చార్జ్, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, సూపరింటెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) వి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

