జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స..

జీజీహెచ్‌లో అద్భుత శస్త్రచికిత్స..
ఏడు సంవత్సరాల బాలుడికి కొత్త జీవితం
అరుదైన ‘నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా’పై విజయం
వైద్యుల సమన్వయంతో ప్రాణాపాయం నుంచి రక్షణ
ఆంధ్రప్రభ, విజయవాడ : గుంటూరుకు చెందిన 14 ఏళ్ల బాలుడు తిరుపతయ్య ఏడు సంవత్సరాలుగా అరుదైన జేఎన్ఏ (జువెనైల్ నాసోఫారింజియల్ ఆంజియోఫైబ్రోమా) వ్యాధితో తీవ్రంగా బాధపడుతూ వచ్చాడు. ఈ వ్యాధి ప్రధానంగా కౌమార దశలో ఉన్న బాలురను ప్రభావితం చేస్తూ, ముక్కు వెనుక భాగంలో ఏర్పడి క్రమంగా ముఖ అంతర్భాగాలకు, కంటి మరియు మెదడు వైపు వ్యాపించే ప్రమాదకర స్వభావం కలిగి ఉంటుంది. తిరుపతయ్యకు ముక్కులో ఒక వైపు ఊపిరి ఆడకపోవడం, తీవ్రమైన రక్తస్రావం, ముఖ ఆకృతి మారిపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీని ప్రభావంతో అతను తీవ్ర మనస్తాపానికి గురై, ఆత్మవిశ్వాసం కోల్పోయి పాఠశాలకు వెళ్లడం కూడా మానివేశాడు. కూలి పనులు చేసే పేద కుటుంబానికి చెందిన ఈ బాలుడి తల్లిదండ్రులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సహా పలువురు ప్రైవేట్ వైద్యులను సంప్రదించగా, ఈ శస్త్రచికిత్సను హైదరాబాద్‌లో మాత్రమే చేయగలమని సూచించారు.
అయితే అనంతరం విజయవాడలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ను ఆశ్రయించారు. ఇఎన్టి విభాగాధిపతి డాక్టర్ కొనిదె రవి నేతృత్వంలో వైద్య బృందం సవాల్‌గా స్వీకరించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. మత్తు వైద్య బృందాధిపతి డాక్టర్ వినయ్, వైద్యులు డాక్టర్ కిరణ్, డాక్టర్ రామరాజు, ఇఎన్టి అసోసియేట్ డాక్టర్ అనిత, డాక్టర్ శ్రీనివాస్, పీజీ వైద్యులు డాక్టర్ ముకుందన్, డాక్టర్ మౌనికతో పాటు నర్సింగ్ సిబ్బంది సామ్రాజ్యం, సంధ్య సమన్వయంతో శస్త్రచికిత్స పూర్తిచేశారు. కంటి, మెదడు ప్రాంతాలకు విస్తరించిన ఈ ప్రమాదకర కణితిని అత్యంత జాగ్రత్తగా తొలగించి బాలుడిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. ప్రస్తుతం బాలుడు కోలుకుంటూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన వైద్య బృందాన్ని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ ప్రత్యేకంగా అభినందించారు. పేద కుటుంబానికి చెందిన బాలుడికి ఉచితంగా సేవలందించి కొత్త జీవితం ఇచ్చిన జీజీహెచ్ వైద్యులు ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
