ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!

ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!

అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ, అలైడ్ సైన్సెస్ కోర్సులకు కూడా వర్తింపు
విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫ్యాకల్టీకి రీసెర్చ్ గ్రాంట్ పెంపు
వర్సిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ఏర్పాటు
ఈ-రీసోర్స్ ద్వారా 24 గంటలపాటు విద్యార్థులకు పరిశోధన సమాచారం
పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లను ఒకే తాటిపై తెచ్చేందుకు కృషి
వైద్య విద్యలో ప్రమాణాల పెంపు కోసం అభివృద్ధికి మరికొన్ని వినూత్న కార్యక్రమాలు
వర్శిటీ ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వెల్లడి

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పరిశోధనలు, క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తున్నామని ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పుల్లల చంద్రశేఖర్ వెల్లడించారు. వైద్య విద్యలో ప్రమాణాల పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీసుకుంటున్న చర్యలకు కొనసాగింపుగా విశ్వవిద్యాలయం తరపున కూడా కొత్త నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు వైద్య విద్య ప్రమాణాల పెంపుతోపాటు వ్యాధుల నిరోధ చర్యల్లో కూడా విశ్వవిద్యాలయం భాగస్వామ్యం కాబోతుందన్నారు.

ఇందులో భాగంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ను కూడా ఏర్పాటుచేస్తున్నామని వెల్లడించారు విజయవాడలోని విశ్వవిద్యాలయంలో సోమవారం మద్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ విశ్వవిద్యాలయంలో జరిగిన 244వ పాలకవర్గ సమావేశం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్ అధ్యక్షతన జరిగింది కేవలం అల్లోపతి వైద్యంలో మాత్రమే కాకుండా ఆయుష్ డెంటల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, ఎలైడ్ సైన్సెస్ (పారా మెడికల్), ఇతర వైద్య కోర్సుల్లో చదివే విద్యార్థులు, బోధకులు (ఫ్యాకల్టీ) పరిశోధనలవైపు దృష్టిపెట్టేలా, క్రీడలను ప్రోత్సహించేలా, పూర్వ వైద్య విద్యార్థుల సహకారాన్ని పొందేందుకు వీలుగా నిర్ణయాలు జరిగాయి.

వీటిని కార్యాచరణలోనికి తెచ్చేందుకు ఏటా రూ. 22.13 కోట్ల వరకు వ్యయమవుతుంది. తాజాగా తీసుకున్న నిర్ణయాలు మూడేళ్లపాలు కొనసాగుతాయి. తదుపరి మరోమారు పునఃపరిశీలన చేసి, నాటి అవసరాలకు తగ్గట్లు చర్యలు తీసుకుంటారు అని ఉపకులపతి డాక్టర్ చంద్రశేఖర్ వివరించారు. విలేకర్ల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ టి. సాయిసుధీర్, వర్శిటీ రీసెర్చి అండ్ డెవలప్మెంటు డైరెక్టర్ డాక్టర్ ఎం. లక్ష్మీసూర్యప్రభ, సి ఓ ఈ శ్రీకాంత్ పాల్గొన్నారు.

..వర్శిటీ కేంద్రంగా ఏఐ బేస్డ్ డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్..

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను సాంకేతికత ఆధారంగా మరింత బలోపేతం చేసేందుకు ఏఐ ఆధారిత డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ (డీఎండీసీ) ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పడబోతుంది. గేట్స్ ఫౌండేషన్ వ్యూహాతక భాగస్వామ్యం, ఏఐ సాయంతో రాష్ట్రంలో వ్యాధుల ముందస్తు అంచనా, నివారణ, తక్షణ చర్యలు తీసుకునేలా ఈ కేంద్రం పనిచేయబోతుంది తొలి ఏడాది ఇందుకు రూ.5.73 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఆ తరువాత నుంచి రూ.3.7 కోట్ల వరకు ప్రతి ఏడాది ఖర్చు అవుతుంది సింగపూర్లోని నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ అనుబంధంగా ఉన్న పబ్లిక్ హెల్త్ డిపార్టుమెంటు(సా స్వీ హక్ స్కూలు ఆఫ్ పబ్లిక్ హెల్త్)తో విశ్వవిద్యాలయం ఒప్పందం చేసుకోబోతుంది. దీనివల్ల డిసీజ్ మోడలింగ్ అండ్ డెసిషన్ సెంటర్ ద్వారా ఎటువంటి కార్యకలపాలు నిర్వహించాలి? ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, వైద్య ఆరోగ్య శాఖ అవసరాలు ఏమిటి? ఎటువంటి చర్యలు తీసుకుంటే భవిషత్తులో వ్యాధులు పెరగకుండా చర్యలు తీసుకోవడానికి వీలుంటుంది? అన్న దానిపై సింగపూర్ వైద్య సంస్థ సలహాలు, సూచనలు ఇస్తుంది దీనిపై అధికారిక ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడతాయి.

..1,000 మంది పరిశోధన విద్యార్థులకు రూ. 30వేల చొప్పున ఉపకార వేతనం!..

పరిశోధనలపట్ల విద్యార్థులు మొగ్గుచూపేలా ప్రతి ఏటా కనీసం 1,000 మందికి ఉపకార వేతనం కింద ఆరునెలలపాటు రూ.5వేల చొప్పున రూ. 30వేలు ఇస్తాం. ప్రస్తుత విధానంలో ప్రతి ఏడాది యూజీ మెడికల్ విద్యార్థులకు మాత్రమే పరిశోధనల నిమిత్తం నెలకు ఐదువేల చొప్పున 500 మందికి రెండునెలలకు కలిపి రూ. 10వేలు మాత్రమే ఇస్తున్నాం కొత్తగా తీసుకున్న నిర్ణయం ప్రకారం పరిశోధన వ్యవధి కాలాన్ని ఆరునెలలకు పొడిగించాం. విద్యార్థుల సంఖ్యను కూడా పెంచాం. ఏయే వైద్య విద్య నుంచి ఎంతమంది విద్యార్థులకు అవకాశాన్ని కలిపించాలన్న దానిపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటాం. విద్యార్థుల పరిశోధన పత్రం ఎంపికలో ష్యాకల్టీ సలహాలు ఇస్తారు. విశ్వవిద్యాలయం జారీచేసే నోటిఫికేషన్కు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. మూడేళ్లకు కలిపి 3వేల మంది విద్యార్థులు స్వల్పకాలిక పరిశోధనలు చేస్తారు అల్లోపతితోపాటు ఆయుష్ పారామెడికల్, ఇతర కోర్సుల్లో చదివే వారిని కూడా ప్రోత్సహిస్తాం.

..ఫ్యాకల్టీనీ ప్రోత్సహించేందుకు రీసెర్చి గ్రాంటు..

ప్రస్తుతం అల్లోపతి, డెంటల్ ఫ్యాకల్టీలో ఎవరైనా పరిశోధనలు చేస్తే ప్రస్తుతం 25 మందికి మాత్రమే రూ.2 లక్షల (ఒక్కొక్కరికి) చొప్పున రూ. 50 లక్షల వరకు ప్రతి ఏడాది (రీసెర్చి గ్రాంటు) విశ్వవిద్యాలయం ఇస్తుంది. అల్లోపతి, డెంటల్ విద్యలో మాత్రమే కాకుండా ఆయుర్వేద, యూనాని, నేచురోపతి, హోమియోపతి (ఆయుష్) బోధకులకు కూడా రీసెర్చి గ్రాంటు సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం దీనివల పరిశోధకుల సంక్య 25 నుంచి ఏకంగా 200కు పెరిగింది ఒక్కొక్కరికి రూ.2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య పరిశోధన పత్రం ప్రాధాన్యత అనుసరించి ఇస్తాo

..పూర్వ వైద్య విద్యార్థుల అసోసియేషన్లకు వారధిగా విశ్వవిద్యాలయం!..

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఎక్కడెక్కడో ఉన్న పూర్వ వైద్య విద్యార్థుల వివరాలు సేకరించి, వారితో సంప్రదింపులు జరిపి, సమావేశాలు నిర్వహించి, కళాశాలల అభివృద్ధికి సహకరించేలా ప్రోత్సహించేందుకు రూ 10 లక్షల చొప్పున మూడేళ్లపాటు ప్రతి కళాశాలకు విశ్వవిద్యాలయం ఇస్తుంది. ప్రస్తుతం కళాశాలల వారీగా రకరకాల స్పెషాల్టీలు, అందరూ కలిసి పూర్త వైద్య విద్యార్థుల అసోసియేషన్లు నడుపుతున్నారు కళాశాలల వారీగానే కాకుండా అన్ని అసోసియేషన్లను ఒక తాటిపైకి తీసుకొస్తారు తద్వారా కళాశాలల వారీగా, స్పెషాల్టీల వారీగా సలహాలు, అభివృద్ధిపనులు చేపట్టేందుకు వీలు ఏర్పడేందుకు వీలుగా విశ్వవిద్యాలయం వారధిగా ఉంటుంది.

..క్రీడల నిర్వహణకు ఏటా రూ. 10 లక్షలు..

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో క్రీడల నిర్వహణ, మైదానాల అభివృద్ధి కోసం ప్రతి కళాశాలకు రూ. 10 లక్షల చొప్పున ప్రతిఏటా ఇస్తారు వైద్య విద్యార్థులకు బోధనతోపాటు మానసికోల్లాసాన్ని కలిగించేలా క్రీడలు, ఇతర పోటీల నిర్వహణకు ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. దీనివల్ల ప్రతి ఏడాది రూ.170 కోట్ల వరకు వ్యయమవుతుంది. ప్రస్తుతం చీడల పోటీలు, ఆటలకు ఉన్న ప్రాధాన్యం పెరగాల్సి ఉంది నిధులు ఇవ్వడం ద్వారా క్రీడలవైపు విద్యార్థులను దృష్టిపెట్టేందుకు వీలవుతుంది’ అని ఉప కులపతి చంద్రశేఖర్, రిజిస్ట్రార్ సాయి సుధీర్, సూర్యప్రభ వివరించారు

…ఈ-రిసోర్స్ కింద జర్నల్స్ సమాచారం..

వీసీ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ మెడ్-నెట్ (మెడికల్ ఆన్లైన్ సర్వీసెస్) కన్సార్షియం ద్వారా అలోపతి, డెంటల్, ఆయుషావైద్య కళాశాలలకు ఈ-రీసోర్స్ ఆన్లైన్ ప్లాటుపాం కింద (24 గంటలపాటు పనిచేసేలా) విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఉపయోగపడేలా జర్నల్స్, వీడియోలు, ఇతర విలువైన సమాచారాన్ని అందుబాటులోనికి తెచ్చాం ఇందుకు రూ.3 కోట వరకు ఖర్చు పెట్టాం. దీనివల్ల పరిశోధనలపట్ల ఆసక్తి ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది’ అని విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ (కన్సార్టియం కో-ఆర్డినేటర్) డాక్టర్ కె.సుధ వెల్లడించారు

Leave a Reply