నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే..

నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే..

గృహ నిర్మాణాల సమాచారం సక్రమంగా చెప్పలేకపోయిన సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం

అవనిగడ్డ – ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం సోమవారం అవనిగడ్డ గ్రామ పంచాయతీ శివారు తిప్పపాలెంలో నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విచ్చేశారు. తిప్పపాలెం లే-ఔటులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మంజూరైన రూ.1.80 లక్షలతో యండలూరి భవానీ నిర్మించుకున్న ఈ గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, లబ్ధిదారులకు తాళం అందచేశారు. ఈ సందర్భంగా లే-ఔటులో ఎన్ని గృహాలు మంజూరు అయ్యాయి? ఎన్ని పూర్తి అయ్యాయి? అని అడిగిన ఎమ్మెల్యేకు సరైన సమాచారం చెప్పని సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేయాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబుకు సూచించారు.

అవనిగడ్డ మండలంలో గృహ నిర్మాణ సామాగ్రి లెక్కలు చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించగా, ఎన్నికల ముందు వచ్చిన 772 కట్టల సిమెంట్ గడ్డ కట్టేసిందని సిబ్బంది వివరించారు. ఈ మేరకు అధికారులకు నివేదించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, ఎంపీపీ తుంగల సుమతి దేవి, ఎంపీడీఓ మరియాదేవి, ఎంపీటీసీ బొప్పన భాను, మండల ప్రత్యేక అధికారి పల్లగాని విష్ణు, హౌసింగ్ ఏఈలు తాడేపల్లి కార్తికేయ, ఆది ధర్మేశ్వరరావు, ఇంజినీరింగ్ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply