AP | సంబ‌రంగా సంక్రాంతి

AP | సంబ‌రంగా సంక్రాంతి

  • జగ్గయ్యపేటలో కర్రసాము, సుగాలి నృత్యాలు
  • వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్

AP | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్య అతిథిగా పాల్గొని పండుగ ఉత్సాహాన్ని ప్రజలతో కలిసి పంచుకున్నారు. సంబరాల్లో భాగంగా నిర్వహించిన సంప్రదాయ కర్రసాము ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ స్వయంగా కర్రసాము చేయగా, ఎంపీ కేశినేని శివనాథ్ అభినందనలు తెలిపారు.

అనంతరం లంబాడీలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ సుగాలి డ్యాన్స్‌లో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ నృత్యంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే విజయవాడ ఉత్సవాల్లో కర్రసాము ప్రదర్శన నిర్వహించాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ను కోరారు. రాష్ట్రం మొత్తం పండుగ వాతావరణంలో ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి సందర్భంగా విశ్రాంతి తీసుకుని రాష్ట్ర అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణించే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ పేర్కొన్నారు.

Leave a Reply