గొల్లపూడిలో చిన్న కాంట్రాక్టర్ల ఆందోళన..

గొల్లపూడిలో చిన్న కాంట్రాక్టర్ల ఆందోళన..

బిల్లుల విడుదలలో వివక్ష తగదు..ప్రభుత్వానికి గడువు
మా బకాయిలు వెంటనే చెల్లించాలి
కుటుంబాలతో ముట్టడి చేస్తాం

ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద చిన్న కాంట్రాక్టర్ల సంఘం ఆందోళన చేపట్టింది. పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేసే విషయంలో అధికారులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. వరుస క్రమంలో బిల్లులు చెల్లించకుండా పెద్ద కాంట్రాక్టర్లకు ఒక విధంగా, చిన్న కాంట్రాక్టర్లకు మరో విధంగా చెల్లింపులు జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మార్చి 19 నాటికి రాష్ట్ర ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు విడుదల చేసినప్పటికీ, తమ ఖాతాల్లో కేవలం 707 కోట్ల రూపాయలు మాత్రమే జమయ్యాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన బకాయిలు ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, పక్షపాత వైఖరి కారణంగానే తమకు అన్యాయం జరుగుతోందని కాంట్రాక్టర్లు వాపోయారు. తమకు రావాల్సిన మొత్తం బిల్లులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే రేపటి నుండి కుటుంబాలతో కలిసి రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని స్థానికంగా చర్చ జరుగుతోంది.

Leave a Reply