ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..

ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..

దుర్గమ్మ ఆలయంలో భారీ పారిశుధ్య కార్యక్రమం
ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు

ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి పర్వతంపై విస్తృత స్థాయిలో పారిశుధ్య సేవా కార్యక్రమం నిర్వహించబడింది. శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, పాలకమండలి చైర్మన్, ధర్మకర్త మండలి సభ్యులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.“పరిసరాల పరిశుభ్రతే పరమాత్మకు మనం అర్పించే నిజమైన సేవ” అనే నినాదంతో ఆలయ ప్రాంగణమంతా శుభ్రపరిచారు. భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా కార్యక్రమం కొనసాగింది.

ఆలయ ఈవో, చైర్మన్ సిబ్బందికి, భక్తులకు మార్గనిర్దేశం చేస్తూ పారిశుధ్యంపై అవగాహన కల్పించారు. ధర్మకర్త మండలి సభ్యులు ఆలయ అభివృద్ధిలో భాగంగా పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇంద్రకీలాద్రిని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు సమన్వయంతో కొండపై ఉన్న మార్గాలు, క్యూ లైన్లు, పరిసర ప్రాంతాలను శుభ్రపరిచారు. అధికారులు మాట్లాడుతూ, ప్రతి భక్తుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంద్రకీలాద్రి పవిత్రతను కాపాడటంలో భాగస్వామ్యం కావాలని కోరారు.

Leave a Reply