పదో తరగతి పరీక్షలు ప్రారంభం..

పదో తరగతి పరీక్షలు ప్రారంభం..

కేంద్రాల్లో వేల మందికి పైగా విద్యార్థులు హాజరు
కేంద్రాల వద్ద భారీ భద్రత
.కమాండ్ కంట్రోల్ డీఈవో నుంచి పర్యవేక్షణ

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి కర్నూలు జిల్లాల్లో కూడా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. రెండు జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు సజావుగా జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు, విద్యార్థుల సంఖ్య కర్నూలు జిల్లాలో 160 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 35,920 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. . పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించినట్లు అధికారులు తెలిపారు.

కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు..

పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేస్తూ గుంపులుగా చేరడాన్ని నిషేధించారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద అనుమతి లేని వ్యక్తులు తిరగకుండా పోలీసులు పహారా కాస్తున్నారు.

ప్రశ్నపత్రాల తరలింపుపై ప్రత్యేక నిఘా..

పరీక్షల భద్రతలో భాగంగా ప్రశ్నపత్రాల తరలింపుపై కూడా ప్రత్యేక నిఘా ఉంచారు. ఉదయం 8 గంటల నుంచి 8.30 గంటల మధ్య పోలీస్ స్టేషన్ల నుంచి చీఫ్ సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రాలను తీసుకెళ్లే మార్గాల్లో పోలీసులు పహారా కాశారు. ప్రశ్నపత్రాలు భద్రంగా పరీక్షా కేంద్రాలకు చేరేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు.జిల్లాలో గుర్తించిన ఎనిమిది సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. పరీక్షల సమయంలో ఎలాంటి అక్రమాలు జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిలేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేలా చర్యలు చేపట్టారు.

కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షణ..

పదో తరగతి పరీక్షల నిర్వహణను కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చీఫ్ సూపరింటెండెంట్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు..

పరీక్షల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి హెచ్చరించారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కేంద్రంలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరీక్షల విభాగపు అసిస్టెంట్ కమిషనర్ గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ప్రారంభమైన పరీక్షలు..

జిల్లాలో మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఉదయం నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాశారు. అధికారులు, పోలీసులు సమన్వయంతో చర్యలు చేపట్టడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షలు కొనసాగుతున్నాయి.

Leave a Reply