జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం..

జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం..
కలెక్టరేట్‌లో కాకాని ఆశయ సాధన సమితి చలివేంద్రం..
సమితి సేవలను ప్రశంసించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఆంధ్రప్రభ, విజయవాడ : వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సందర్శకులకు చల్లని మజ్జిగ అందించేందుకు కాకాని ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, కాకాని ఆశయ సాధన సమితి ఛైర్మన్ డా. తరుణ్ కాకాని తదితరులతో శుక్రవారం కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ పీ4లో భాగంగా ఇప్పటికే కాకాని ఆశయ సాధన సమితి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో కలెక్టరేట్ సందర్శకుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే భావంతో ముందుకు వస్తున్న స్వచ్ఛంద సంస్థలు ఇతరులకు కూడా ఆదర్శంగా నిలుస్తాయని కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పేర్కొన్నారు.
