AP | మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు

AP | మాజీ మంత్రి వెల్లంపల్లిపై ఏసీబీకి జనసేన ఫిర్యాదు
టీటీడీ లడ్డు కల్తీ కేసులో పాత్ర ఉందంటూ ఆరోపణలు
కాల్ డేటా ఆధారాలతో ఫిర్యాదు చేసిన బాడిత శంకర్
AP | భవానిపురం, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుపై ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాడిత శంకర్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) లడ్డు కల్తీ వ్యవహారంలో వెల్లంపల్లి పాత్ర ఉందని ఆరోపిస్తూ, దీనికి సంబంధించి పూర్తి కాల్ డేటా ఆధారాలు ఇప్పటికే అధికారులకు అందజేశామని బాడిత శంకర్ పేర్కొన్నారు. వైసీపీ పాలనలో దేవాదాయ శాఖలో అవినీతి అధికారులకు పెద్దపీట వేశారని, అందులో భాగంగా వెల్లంపల్లి కీలక పాత్ర పోషించారని ఆయన విమర్శించారు. అదేవిధంగా బోలె బాబా డైరీ వ్యవహారంలో కూడా వెల్లంపల్లితో ఉన్న సంబంధాలు బహిర్గతమయ్యాయని, టీటీడీ సేవా టికెట్లను అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలూ ఉన్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితే వెల్లంపల్లి త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కృష్ణాజిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ సమ్మెట రాజా నాయుడు, జనసేన నాయకులు పేటేటి నాంచారయ్య, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు సమతం సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున అవినీతిపై పోరాటం కొనసాగుతుందని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టబోమని నేతలు స్పష్టం చేశారు.
