Anniversary | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

Anniversary | ఘనంగా అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

  • భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్
  • త్వరలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం


ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
Anniversary | అచ్చంపేట‌, ఆంధ్ర‌ప్ర‌భ : భారతదేశానికి దిశా, నిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్ (Ambedkar) సేవలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలో భారత రాజ్యాంగ శిల్పి, సామాజిక సమానత్వ పోరాట యోధుడు, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను అంబేద్కర్ యువజన సంఘం, అచ్చంపేట డివిజన్ అధ్యక్షులు పాతుకుల శ్రీశైలం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే (MLA) వంశీకృష్ణ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… సామాజిక న్యాయం, సమానత్వం, ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో అంబేద్కర్ పోషించిన పాత్ర అపూర్వమని కొనియాడారు. ప్రతి భారత పౌరుడు తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలని, అంబేద్కర్ చూపిన మార్గం మనల్ని చైతన్యవంతమైన సమాజం వైపు నడిపిస్తుందని, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టే బాధ్యత అందరిపైనా ఉందని ఎమ్మెల్యే అన్నారు.

విద్యార్థుల అభ్యాసానికి మరింత తోడ్పాటు అందించేందుకు అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కేంద్రంలో పోటీ పరీక్షల కోసం అవసరమైన స్టడీ మెటీరియల్స్‌ను అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ (Market) కమిటీ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, ఉమామహేశ్వర చైర్మన్ బీరం మాధవరెడ్డి, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు బీసమిళ్ళ ఆనంద్, మీసాల ప్రభాకర్, కొంకి విజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply