ప్రాణాలతో ఇసుకలో పాతిన మృగాలు
- మానవత్వం చాటిన పారిశుధ్య కార్మికులు
- తిరుపతి రుయాకు పసికందు తరలింపు
- చికిత్స పొందుతూ కన్నుమూసిన పసికందు
వరదయ్యపాలెం / తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ‘అమ్మా నవమాసాలు మోసి కన్నావు.. పుట్టి పుట్టగానే ఎందుకమ్మా వదిలించుకున్నావ్.. భారం అనుకున్నావా.. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన నేరమా..?’ .. మాటలొస్తే ఆ పసికందు తన కన్నతల్లిని ఈ ప్రశ్నలు అడిగేదేమో.. ఇసుకలో పూడ్చిపెట్టి కళ్లు కూడా సరిగా తెరవని ఆ పసికందు ఏడ్చిఏడ్చి కళ్లు మూసింది. ఈ హృదయ విదారక ఘటన వరదయ్యపాలెం మండల కేంద్రంలో జరిగింది. తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అప్పుడు భూగర్భంలో భూమిజ ఉదయించింది. అదే మన రాములోరి సతీమణి సీతమ్మ, ఈరోజు సైకత సమాధిలో.. బొడ్డూడిన పసిపాప దొరికింది. తొమ్మిది నెలలు మోసిన తల్లికి తెలుసో లేదో.. కొన్ని గంటల కిందట భూమ్మీద పడి కళ్లు తెరవని ఈ శిశువును పీకలోతు ఇసుకలో పాతిన దుర్మార్గులెవరో కానీ మానవతం లేని దానవులే. శవం అనుకుని కుక్కలు ఆ శిశువుపై దాడి చేశాయి. ఆ శిశువు కెవ్వు కేకతో .. వదిలి వెళ్ళిపోయాయి.
భళ్లున తెల్లారిన తరువాత పారిశుధ్య కార్మికులే.. ఆత్మబంధువులయ్యారు. కానీ.. విధి వక్రీకరించింది. ఆ పసికందును మృత్యువు కాటేసింది. ఈ దయనీయ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. వరదయ్యపాలెం బస్టాండ్ సమీపంలో ఒక గుర్తు తెలియని మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి, అనంతరం ఆ బిడ్డను ఓ మెడికల్ షాపు దగ్గర ఇసుకలో పూడ్చి వెళ్లిపోయింది. ఏదో మాంసపు ముద్ద అనుకుని కుక్కలు తినడానికి వెళ్లగా.. తెల్లవారుజామున వీధులు శుభ్రం చేయడానికి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు పసికందు ఏడుపు వినిపించాయి.
చుట్టుపక్కల వెతకగా ఇసుకలో ఉన్న పసికందును గుర్తించి తల్లడిల్లిపోయారు. పసిపాపను చేతుల్లోకి తీసుకొని వరదయ్యపాలెం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. చికిత్స కోసం పోలీసులుపసికందును వరదయ్యపాలెం పీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. అక్కడ సదుపాయాలు లేకపోవడంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాళహస్తికి రెఫర్ చేశారు.
అనంతరం, మెరుగైన చికిత్స కోసం సూళ్లూరుపేటకు సిపార్సు చేశారు. చిన్నారికి అవసరమైన వైద్య సహాయం అందించడంలో సమస్యలు ఎదుర్కొన్నందున, అక్కడి నర్సు పసికందును తిరుపతికి తరలించాలని సూచించారు. అక్కడ అత్యవసర పరిస్థితులకు తగిన వైద్య సహాయం అందుతుందని భావించిన అధికారులు తిరుపతి రూయాకు రెఫర్ చేశారు. దీంతో అధికారులు హుటాహుటిన తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం పసిప్రాణం తుది శ్వాస విడిచింది.
ఆడబిడ్డ అనే వదిలేశారా?
ఈ శిశువు మృతి వెనుక కారణాలేంటో.. సభ్య సమాజాన్ని కుదిపేస్తున్నాయి. తల్లి నయా కుంతీదేవీనా? తండ్రి ఆధునిక దుష్యంతుడా? ఆడ పిల్ల పుట్టిందని కుటుంబ సభ్యులే చంపేశారా? ఏది ఏమైనా.. ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ఆయా పథకాలు అమలుకు నోచుకోకపోవడమే ప్రధాన కారణం. ఆడపిల్లల కోసం సర్కార్ ప్రవేశపెట్టిన భేటీ బచావో…భేటీ పడావో లాంటి పథకాలు ఎన్ని ఉన్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఘటనపై సత్యవేడు సీడీపీవో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.