Andhra Prabha SPL Story | ఉత్తరాది, దక్షిణాది సమతౌల్యం కీలకం..

Andhra Prabha SPL Story | ఉత్తరాది, దక్షిణాది సమతౌల్యం కీలకం..
Andhra Prabha SPL Story | డీలిమిటేషన్ మరియు నియోజకవర్గాల పెంపు అవసరం
పార్లమెంట్ మరియు అసెంబ్లీ సీట్ల పెంపు ప్రణాళిక
మహిళ రిజర్వేషన్ బిల్లు మరియు ప్రజాస్వామ్య బలం
జనాభా ఆధారంగా సీట్ల పెంపుపై ఉత్తరాది-దక్షిణాది వివాదం
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం మరియు సమన్యాయం అవసరం
తెలుగు రాష్ట్రాలలో సీట్ల పెంపు ప్రభావం
Andhra Prabha SPL Story | దేశంలో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలను పునర్విభజించి, వాటి సంఖ్యను పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. అయితే, ఈ పునర్విభజనకు సమన్యాయం గీటురాయి కావాలి. ప్రస్తుత నియోజకవర్గాలను.. మరో 50 శాతం పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. అలా చేసినా దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో నియోజక వర్గాల సంఖ్య బాగా పెరిగి రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఒకవేళ జనాభా ప్రామాణికంగా తీసుకుంటే ఉత్తరాదిలో నియోజకవర్గాల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. దక్షిణాదిలో పెరిగే నియోజకవర్గాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పటికే దక్షిణాది పై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న భావన, ఉత్తరాది ఆధిపత్యం ఎక్కువన్న భావన ఉంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ విషయంలో కేంద్రం జాగ్రత్తగా అడుగులు వేయాలి.
కేంద్రం ప్రభుత్వం ప్రస్తుతమున్న 543/545 పార్లమెంట్ ఎంపీ స్థానాలను 816కు పెంచే ప్రణాళిక, 4,123 అసెంబ్లీ స్థానాలను 6185కు పెంచే యోచనతో 2029లో జమిలి ఎన్నికలను నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మెఘావాల్ ప్రకటించారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందాక కమిషన్ ఏర్పాటు చేసి సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కానుంది. 2023లో ఆమోదం పొందిన మహిళ బిల్లు (నారీ శక్తి వందన్ అదినియమ్) ప్రకారం చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం శుభ పరిణామం.
1993లో 73,74వ రాజ్యాంగ సవరణల ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ గ్రామ పంచాయతీలలో అమలైంది. 1996లో చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నించినా బిల్లు ఆమోదం పొందలేదు. 1998, 1999, 2003లో బిల్లు ప్రవేశపెట్టినా ఏకాభిప్రాయం లేక పెండింగ్‌లో పడింది. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందినా లోక్‌సభలో ఆగిపోయింది. 2023లో ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందడం శుభదాయకం. ఇది దేశ ప్రజాస్వామ్యానికి బలాన్నిచ్చే నిర్ణయం.
ప్రజాస్వామ్యం ప్రజల చేతుల్లో ఉండే అత్యున్నత వ్యవస్థ. డెమోక్రసీ అనే పదం డెమోస్ (ప్రజలు), క్రాటోస్ (పరిపాలన) అనే గ్రీకు పదాల నుండి వచ్చింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు ప్రజల తరపున పాలన సాగిస్తారు. మన దేశంలో 150 కోట్ల జనాభాకు తగిన ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉంది. 1952లో 38 కోట్ల జనాభాకు 489 లోక్‌సభ స్థానాలు, 1973లో 62 కోట్లకు 543 స్థానాలు, ఇప్పుడు 150 కోట్లకు చేరువైన జనాభాకు కూడా అదే సంఖ్య కొనసాగడం అసమానతను చూపుతోంది.
ప్రజాస్వామ్యానికి ప్రధాన ఆధారం సాధారణ ప్రజలే. ఓటు తూటాకంటే శక్తివంతమైనది. 50 ఏళ్ల నిరీక్షణ తర్వాత సీట్ల పెంపు సంతోషకర పరిణామం. ప్రజల ప్రాతినిధ్యం పెరగడం ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టి చేస్తుంది. చట్టసభలలో ఎక్కువ మంది ప్రజలకు భాగస్వామ్యం కల్పించడం ప్రజాస్వామ్య బలానికి సూచిక. గతంలో 1952, 1963, 1973లో పునర్విభజన జరిగింది, 2002లో అసెంబ్లీ స్థానాలు పెరిగినా లోక్‌సభ స్థానాలు పెరగలేదు. ఇప్పుడు ఎస్సీలకు 84 నుంచి 126, ఎస్టీలకు 47 నుంచి 70 స్థానాలు పెరగడం సమానత్వానికి దారి తీస్తుంది.

కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించకుండా అన్ని రాష్ట్రాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం 1952లో ప్రారంభమైంది. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో పురోగతి సాధించాయి. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరుగుదల అధికంగా ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో జనాభా విస్తరించింది. జనాభా ప్రామాణికంగా సీట్లు పెంచితే ఉత్తరాదికి అధిక ప్రాతినిధ్యం లభిస్తుంది. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉంది.
ఉత్తరాది ప్రాతినిధ్యంతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి రావచ్చు. ఇది రాజకీయ అసమానతకు దారి తీస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు తమ హక్కుల కోసం పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మంత్రిత్వ శాఖల కేటాయింపులో వివక్ష ఉందని విమర్శలు ఉన్నాయి. కీలక శాఖలు ఉత్తరాదికి, సాధారణ శాఖలు దక్షిణాదికి వెళ్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు 179కు, 17 లోక్‌సభ స్థానాలు 26కు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు 263కు, 25 లోక్‌సభ స్థానాలు 38కు పెరుగుతాయి. చట్టసభల స్థానాల పెంపు సమన్యాయం ఆధారంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఉత్తరాది-దక్షిణాది మధ్య సమతౌల్యం కాపాడితే ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది.
డా. కావలి చెన్నయ్య
90004 81768
