America President | పుతిన్ పై అంత కోపం ఎందుకు?
వెబ్ డెస్క్ ఆంధ్రప్రభ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump)… రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (putin) పై గత కొన్ని నెలలుగా తన కోపాన్ని వెళ్ళగక్కుతూ అనేక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాఖ్యానించడమే కాక, తనకు పుతిన్ పై చాలా కోపంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. ఆ తర్వాత ఏకంగా పుతిన్ పూర్తిగా పిచ్చివాడు అనికూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అసలు ట్రంప్ కి పుతిన్ పై అంత కోపమెందుకు? ఇది వ్యక్తిగతమా? రాజకీయమా? రెండూ కరెక్టేనంటున్నారు విశ్లేషకులు.
ఎలాగంటే, నేను అధికారంలోకొచ్చాక రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని (Russia – Ukraine war) 24 గంటల్లో ఆపగలను అని ఎన్నికల ప్రచారంలో పలికిన ట్రంప్, అధికారంలోకొచ్చాక రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు సౌదీ అరేబియాలో వారిద్దరి మధ్య శాంతి చర్చలు ప్రారంభించారు. కానీ అవి సఫలం కాకపోవడం, యుద్ధం కొనసాగడం పుతిన్ పై ట్రంప్ కోపానికి బీజం పడిందనుకోవచ్చు.
America President | యుద్ధం ఆగితే ట్రంపుకేం లాభం?
నోబెల్ శాంతి పురస్కారం (Nobel Prize)పై గంపెడాశలు పెట్టుకున్న ట్రంప్, యుద్ధాలు ఆపానని పదే పదే ప్రకటించుకున్నారు. ఒకవేళ సౌదీలో జరిగిన చర్చలు సఫలం అయి, యుద్ధం ఆగిపోయి ఉంటే, తను ఆపిన అతి పెద్ద యుద్ధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని చెప్పుకోవడానికి ఉండేది. కానీ పుతిన్ అందుకు వీల్లేకుండా చేశాడని ట్రంప్ కోపానికి ప్రధాన కారణం.
ఇక అప్పట్నుంచీ ట్రంప్ తన రూటు మార్చి, పుతిన్ ను అనేక విధాల దెబ్బ తీయాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. రష్యాకు ఎవరెవరు ఏయే విధంగా సహకరిస్తున్నారు? వారికి ఎవరెవరితో వ్యాపార-వాణిజ్య సంబంధాలున్నాయి అనేది చూసుకుని, వాళ్ళందరి మీదా తన టారిఫ్ (tariff)లు ప్రయోగించడం మొదలు పెట్టాడు.
America President | రష్యాపై కోపం.. భారత్ పై ప్రయోగం..
అదే క్రమంలో భారత్ (INDIA) తో రష్యా స్నేహం కూడా ట్రంప్ కు నచ్చలేదు. భారత్ పై టారిఫ్ లు ప్రయోగిస్తే రష్యాతో భారత్ స్నేహాన్ని వదులుకుంటుందని భావించాడు. అదీ జరగలేదు. ఇక రష్యాతో సంబంధాలున్న ప్రతి దేశంపైనా ఏదోక పన్నుల రూపంలో విరుచుకు పడుతూనే ఉన్నాడు.
ఈ దూకుడు చర్యల వల్ల ఏ రెండు దేశాలూ తమ మధ్య స్నేహాన్ని వదులుకోలేదు సరికదా, అమెరికాకి ప్రత్యామ్నాయాన్ని వెతుక్కున్నాయి. దీంతో అమెరికాకే ఎక్కువ నష్టం కలిగింది. చైనాతోనూ స్నేహమంటూ-శత్రుత్వమంటూ దోబూచులాడడం ట్రంప్ చపలచిత్తానికి నిదర్శనం. ఇక భారత్ విషయానికొస్తే మోదీ తనకు మంచి స్నేహితుడంటూనే, భారత్ పై సుంకాలు తప్పవని హుంకరిస్తున్నాడు.
America President | ఒక్కరు కాదు, ఇద్దరు !!
ఇలా ట్రంప్ వైఖరి చూస్తుంటే అతనిలో ఒక్కరు కాదు, ఇద్దరున్నారనిపిస్తుంది. ఒకరేమో పక్కా వ్యాపారి. ప్రతి పనీ, ప్రతి సంబంధాన్ని వ్యాపార దృక్పథంతో చూస్తూ, లాభనష్తాలు బేరీజు వేసుకుంటూ కొనసాగే వ్యక్తి.
ఇక రెండవది, అమెరికా సామ్రాజ్యవాదం… అధ్యక్షునిగా సూపర్ ఇగో… అందరూ తాను చెప్పినట్టే వినాలనీ, అన్ని దేశాలూ తన కనుసన్నల్లోనే మెలగాలనీ కోరుకునే వ్యక్తి. ఈ ఇద్దరి మధ్యా నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది.
కానీ, ఒకరు గెలవాలంటే మరొకరు ఓడిపోక తప్పదు కదా, అందుకే అధ్యక్షుడు గెలిచినప్పుడు వ్యాపారి నష్టపోతున్నాడు, వ్యాపారి నెగ్గినప్పుడు అధ్యక్షుడు తగ్గాల్సి వస్తోంది.
America President | కంటికి కనిపించని యుద్దం
బ్రిక్స్ సమ్మిట్‌లో చైనా-రష్యాల మధ్య సంబంధాలు బలపడడం ట్రంప్‌ను బాధించింది. ఎందుకంటే ట్రంప్ కు చైనాతో వాణిజ్య యుద్ధం ప్రధాన లక్ష్యం. అందుకే టారిఫ్ లు వందా, నూటయాభై, రెండొందలు, మూడొందల నుంచి ఏకంగా ఐదొందల శాతానికి పెంచేశారు. పెంచడం.. తగ్గించడం… చర్యలుంటాయని ప్రకటించడంతో ట్రంప్ అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను అయోమయానికి గురిచేస్తున్నారు.
మొత్తానికి అత్తారింటికి దారేది సినిమాలో డైలాగ్ లాగా ట్రంప్ ‘‘కంటికి కనిపించని శత్రువుతో యుద్దం చేస్తున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు లక్ష్యాలను, వ్యక్తులను మార్చుకుంటూ ఉక్రోషాన్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు. అంతిమంగా ట్రంప్ ప్రతీ చర్య వల్లా అమెరికన్లే నష్టపోతున్నారు. వలసవాదులను రానీయకుండా అడ్డుకోవడం, వీసాల నిబంధనలను కఠినతరం చేయడం, అప్పటికే దేశంలో స్థిరపడిన వారిని సాగనంపే ప్రయత్నాలు చేయడం కూడా ట్రంప్ కు ఎదురుదెబ్బ కొట్టినట్టే అయింది. అమెరికాలో తగినంతమంది ప్రతిభావంతులు లేకపోవడంతో ట్రంప్ తన నిబంధనలను అడ్డు తొలగించి విదేశీ ప్రతిభావంతులకు, వృత్తి నైపుణ్యం కలిగిన వారికి తిరిగి స్వాగతం పలకాల్సి వచ్చింది. అయినా మనసొప్పక వాటిలోనూ తిరకాసులు పెడుతూ తికమక పెట్టేసి తానూ తికమక పడ్డారు.

విదేశీ ప్రతిభావంతులు రావొచ్చు కానీ, మావాళ్ళకి శిక్షణ ఇచ్చి మళ్ళీ వెళ్ళిపొండి అనడంతో విదేశీ విద్య, ఉపాధి అవకాశాల కోసం అమెరికా కలలు కంటున్న వాళ్ళంతా మెల్లిగా వేరే దేశాలను వెతుక్కోవడం మొదలు పెట్టారు.
తమ దేశంలో పర్యటకం అభివృద్ధి పొందాలి, విదేశీమారక నిల్వలు పెరగాలి, ప్రతిభావంతులు కావాలి, కానీ, తమవాళ్ళకే అవకాశాలు పరిమితం కావాలి..ఇలా తనలోని ద్వంద్వ వైఖరితో తనలోని వ్యాపారీ, దేశాధ్యక్షులిద్దరితో తానే పోరాడుతూ దూకుడుగా…దుందుడుకుగా వ్యవహరిస్తూ అమెరికాని ఒకడుగు ముందుకు…రెండడుగులు వెనక్కి నడిపిస్తూ తననెన్నుకున్న అమెరికన్లకి తన విచిత్ర పాలనను రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారు ట్రంప్.
ఒకానొక దశలో ఈ వ్యక్తినేనా మేం ఎన్నుకున్నది అని అమెరికన్లే తలలు పట్టుకునేలా చేస్తున్నారు ట్రంపు మహాశయుడు. అంతేనా. విసుగెత్తిన అమెరికన్లు రోడ్లెక్కి “నో కింగ్స్” ఉద్యమం పేరుతో నిరసనలు వెల్లువెత్తాయి కూడా. అక్కడి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ట్రంప్ పై నిరసనను స్పష్టంగా వ్యక్తం చేసాయి కూడా….ప్రజాస్వామ్యయుతంగా తననెన్నుకున్న ప్రజలకి నియంతృత్వ పోకడలతో నిరంకుశ పాలనను అందించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
అంతవరకు స్తబుగా కొనసాగిన బైడెన్ పాలనను మరిపించి పరిగెత్తిస్తాడనుకున్న అమెరికన్లను తన దూకుడుతో హడలెత్తిస్తూ ఏరోజు ఏ నిర్ణయం తీసుకుంటారో అని అయోమయానికి గురిచేస్తున్నారు..నిజానికి పాలకుల్లో రాజకీయం, వ్యాపారం, వాణిజ్యం ఇలా పలురకాల ప్రయోజనాలను ఆశించే విజనరీ ఉండాల్సిందే. కానీ ఒక కోణం ప్రయోజనాలను మరో కోణం దెబ్బతీసేలా ఉండకూడదు…అమెరికాలో అదే జరుగుతోంది…

